సినిమా పేరు గుడ్ లక్ సఖి. ఇందులో హీరోయిన్ ను బ్యాడ్ లక్ వెంటాడుతుంది. దాన్ని అధిగమించి ఆమె ఎలా షూటింగ్ లో టైటిల్ విజేతగా నిలిచిందనేది సినిమా. కథ సంగతి పక్కనపెడితే.. విడుదల విషయంలో మాత్రం సినిమాకు బ్యాడ్ లక్ వెంటాడుతోంది.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఎల్లుండి విడుదలకు సిద్ధమౌతోంది. ఈరోజు గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేద్దామనుకున్నారు. ఇక్కడ కూడా బ్యాడ్ లక్ వెంటాడింది.
ఈరోజు సాయంత్రం జరగనున్న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు నిర్మాతలు. చిరంజీవి కూడా ఓకే చెప్పారు. ఈ మేరకు పోస్టర్లు కూడా వచ్చేశాయి. అంతలోనే చిరంజీవి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని, ఐసొలేషన్ లోకి వెళ్తున్నానని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. దీంతో గుడ్ లక్ సఖి టీమ్ మరోసారి డీలా పడింది.
మొన్నటికిమొన్న ట్రయిలర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆర్భాటంగా విడుదల చేసిన ట్రయిలర్ తుస్సుమనిపించింది. కొత్తదనం లేదంటూ పెదవి విరుపులు ఎక్కువయ్యాయి. అలా ట్రయిలర్ విషయంలో కూడా బ్యాడ్ లక్ ఎదుర్కొన్న ఈ సినిమా, ఇప్పుడు చిరంజీవి గైర్హాజరీతో ఆ బ్యాడ్ లక్ ను కొనసాగిస్తోంది.
ఉన్నంతలో మెచ్చుకోదగ్గ విషయం ఏదైనా ఉందంటే.. అది రామ్ చరణ్ ఈ సినిమా ఫంక్షన్ కు హాజరవ్వడమే. తాను రాలేకపోయినా, తనయుడు చరణ్ ను ఈ ఫంక్షన్ కు పంపిస్తున్నారు చిరు. థియేటర్లలోకి వచ్చిన తర్వాతైనా ఈ సినిమా తన బ్యాడ్ లక్ ను వదిలించుకోవాలని ఆశిద్దాం.