ప్రజాస్వామ్యానికి సంబంధించి పెద్ద పెద్ద సంస్కరణలను ప్రవచిస్తూ ఉంటారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అయితే ప్రజాస్వామ్య బేసిక్ భావనలను మాత్రం బీజేపీ తన కన్వీన్సింగ్ కొద్దీ పాటించదు! ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు.
ఆ సంగతలా ఉంటే.. మొదటి సారి ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదాన్ని ఇస్తున్నారు మోడీ. ఈ క్రమంలో ఈ అంశంపై రకరకాల చర్చలు, కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలతో సమావేశాలు నిర్వహించడం వంటివెన్నో చేసింది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి బేసిక్ డౌట్లను ఇప్పటి వరకూ ఎవ్వరూ తీర్చలేదు!
దేశంలో నిరంతరం ఎన్నికల ప్రక్రియ అభివృద్ధికి విఘాతం అని మోడీ అంటున్నారు. రాష్ట్రాల అసెంబ్లీలకూ, లోక్ సభకూ ఒకేసారి ఎన్నికలు అయిపోతే.. ఐదేళ్లూ పాలించుకుంటూ పోవడమే మేలని అంటున్నారు. దీని వల్ల ఖర్చు తగ్గుతుంది, ఒకసారి ఎన్నికలు అయిపోయే ఇక అభివృద్ధి చేసుకుంటూ పోవడమే అంటున్నారు!
ఇంత వరకూ బాగానే ఉంది, మరి ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే? బీజేపీ వాళ్లే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూల్చారు కదా! కర్ణాటక, మధ్యప్రదేశ్…ఇలా జాబితా పెద్దదే. మరి ప్రతి సారీ ఫిరాయింపుదార్లను పట్టుకుని బండి నడిపిస్తున్నారు. అయితే ఎక్కడైనా ప్రభుత్వం కూలిపోయాకా ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి వస్తే? అప్పుడేం చేస్తారు? మళ్లీ లోక్ సభకు ఎన్నికలు వచ్చే వరకూ.. ఆ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉండదా? ఆ రాష్ట్రంలో పాలనను కేంద్రం టేకోవర్ చేస్తుందా?
ఇప్పుడంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి.. కేంద్రం పాలనను స్వాధీనం చేసుకోవడం వరకూ బాగానే అనిపించవచ్చు. అయితే మరి రేపు బీజేపీ భాగస్వామ్యం లేని ప్రభుత్వం వస్తే.. అప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలను ముప్పు తిప్పలు పెట్టవా? అయినా.. ప్రభుత్వాలు పడిపోతే ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పరిస్థితి ఏమిటి? అనే బేసిక్ డౌట్ కు ఇప్పటి వరకూ ఎవ్వరూ ఇతమిద్ధంగా ఆన్సర్ ఇవ్వలేదు.
మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఎప్పటికప్పుడు ఎన్నికలనూ పెట్టేస్తున్నారు. దీంతో మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒట్టి నినాదంగా మిగిలిపోయిందనుకున్నారంతా. అయితే మోడీనే నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మళ్లీ ఈ నినాదమే ఇచ్చారు! ఇది వ్యూహాత్మకమేనా?