ఇండియా-కివీస్ టీ20.. మ‌ళ్లీ అదే సూప‌ర్ థ్రిల్!

ఇండియా వ‌ర్సెస్ కివీస్ మూడో టీట్వంటీ త‌ర‌హా వినోదాన్నే అందించింది నాలుగో టీట్వంటీ కూడా. ఈ మ్యాచ్ కూడా సూప‌ర్ ఓవ‌ర్ కు దారి తీయ‌డం.. య‌థారీతిన ఇండియా సూప‌ర్ ఓవ‌ర్లో స‌త్తా చూపించ‌డం..…

ఇండియా వ‌ర్సెస్ కివీస్ మూడో టీట్వంటీ త‌ర‌హా వినోదాన్నే అందించింది నాలుగో టీట్వంటీ కూడా. ఈ మ్యాచ్ కూడా సూప‌ర్ ఓవ‌ర్ కు దారి తీయ‌డం.. య‌థారీతిన ఇండియా సూప‌ర్ ఓవ‌ర్లో స‌త్తా చూపించ‌డం.. అదే కివీస్, అదే సౌథీ, అదే విజ‌యం.. అన్న‌ట్టుగా సాగింది నాలుగో టీట్వంటీ. ఈ మ్యాచ్ లో స్కోరింగ్ థ్రిల్ల‌ర్ అని చెప్ప‌వ‌చ్చు.

ఒక ద‌శ‌లో మ్యాచ్చే టీమిండియా చేతి నుంచి జారి పోయిన‌ట్టుగా క‌నిపించింది. తొలి ప‌ది ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్ పోయింద‌నే ప‌రిస్థితి తలెత్తింది. 80 ప‌రుగుల చిల్ల‌ర‌కే ఆరు వికెట్లు పోయాయి! అలాంటి స్థితి నుంచి మ‌నీష్ పాండే అద్భుత బ్యాటింగ్ తో.. లోయ‌ర్ ఆర్డ‌ర్ ఇచ్చిన స‌హకారంతో.. టీమిండియా క‌నీసం 165 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. ఈ త‌క్కువ స్కోర్ ను కాపాడుకోవ‌డంలో బౌలింగ్ విభాగం క‌ట్టుదిట్టంగా ప‌ని చేసింది. ఆఖ‌రి ఓవ‌ర్లో కేవ‌లం ఏడు ప‌రుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది కివీస్. అప్ప‌టికి ప‌డింది కూడా మూడు వికెట్లే!

అయినా కివీస్ కు క‌లిసి రాలేదు. ఏడు ప‌రుగులు చేయాల్సిన స్థితిలో ఆఖ‌రి ఓవ‌ర్లో ఆరు ప‌రుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖ‌రి బంతికి ఒక్క ర‌న్ చేస్తే గెలిచే ప‌రిస్థితుల్లో రన్ ఔట్ తో.. మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూప‌ర్ ఓవ‌ర్ త‌ప్ప‌లేదు. ఈ ఓవ‌ర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 13 ప‌రుగులు చేసి 14 ప‌రుగుల టార్గెట్ ను నిర్దేశించింది.

ఈ టార్గెట్ ను రాహుల్, కొహ్లీలు సునాయాసంగా చేధించారు. కివీ కెప్టెన్ సౌథీ సూప‌ర్ ఓవ‌ర్లో మ‌రోసారి ఫెయిలయ్యాడు. రాహుల్ తొలి రెండు బంతుల్లోనే మ్యాచ్ ఇండియా వైపు తెచ్చాడు. తొలి బంతి సిక్స్, రెండో బంతి ఫోర్ తో.. మ్యాచ్ ఇండియా వైపు మొగ్గింది. మూడో బంతికి అత‌డు ఔట్ అయినా.. ఆ త‌ర్వాతి రెండు బంతుల్లో కొహ్లీ ప‌ని పూర్తి చేశాడు. 

ఇప్ప‌టికే వ‌ర‌స‌గా సూప‌ర్ ఓవ‌ర్ల‌తో కివీస్ ప‌లు మ్యాచ్ ల‌ను కోల్పోయింది. సూప‌ర్ ఓవ‌ర్ టై కావ‌డంతో..ఆ జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ నే కోల్పోయింది. ఇలాంటి నేప‌థ్యంలో.. మ‌రోసారి కూడా ఆ జ‌ట్లు సూప‌ర్ ఓవ‌ర్ లో ఓడిపోయింది. చేతుల్లోకి వ‌చ్చిన మ్యాచ్ ను కోల్పోయింది. ఈ సీరిస్ లో ఐదో టీట్వంటీ జ‌ర‌గాల్సి ఉంది. క్లీన్ స్వీపే ల‌క్ష్య‌మ‌ని టీమిండియా కెప్టెన్ కొహ్లీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. చేజారింద‌నుకున్న మ్యాచ్ ల‌లో గెలుపు స్క్రిప్ట్ ను ర‌చిస్తూ.. టీమిండియా ఒక ఛాంపియ‌న్ లా ఆడుతూ ఉంది.