భూములు ఇవ్వడమే హక్కు అయితే తాము అమరావతి రైతులకు రెట్టింపు భూములు ఇచ్చామని విశాఖ జిల్లా రైతాంగం అంటోంది. అమరావతి రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారని, అందువల్ల అక్కడే రాజధానిని ఉంచాలంటూ టీడీపీ, ఇతర పార్టీలు వత్తాసు పలుకుతూండడాన్ని విశాఖ జిల్లా రైతులు తప్పుపడుతున్నారు, మండిపడుతున్నారు.
అమరావతి రైతులు అభివ్రుధ్ధి అంతా తమకే కావాలని మొండికెత్తుతున్నారని, నిజానికి అభివ్రుధ్ధిలో మాకూ వాటా కావాలన్నది తమ న్యాయమైన డిమాండ్ అంటున్నారు విశాఖ రైతులు. పైగా తాము ఇచ్చిన భూముల విలువ, తమకు దక్కిన ప్రతిఫలం చూసుకుంటే ఎంతగా నష్టపోయామో ఎవరికి తెలుసు అంటున్నారు.
ఎకరం కేవలం 1700 రూపాయలు వంతున తాము స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చామని, ఏకంగా 22 వేల ఎకరాలు ఇలా తమ నుంచి అభివ్రుధ్ధి పేరిట పాలకులు గుంజుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆ తరువాత మరో పదకొండు వేల ఎకరాలు విస్తరణ కోసం తీసుకున్నారని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చెబుతున్నారు.
దానికి గాను తమకు దక్కింది ఆర్ కార్డులు తప్ప ఉద్యోగాలు కావని, ఇప్పటికి మూడు తరాలుగా తాము ఉపాధి లేక అల్లలాడుతున్నామని స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చిన రైతులు అంటున్నారు.
అలాగే విశాఖలోని ఎంటీపీసీకి, సెజ్ లకు, రాంబిల్లి దగ్గర నావీ కోసం వేలల్లో ఎకరాలు ఇచ్చ్చామని చెబుతున్నారు. పరవాడ వద్ద ఫార్మా సిటీకి వేల ఎకరాలు ఇచ్చి కాలుష్యం బారిన పడ్డామని, అనారోగ్యంతో అవస్థలు పడుతున్నమని కూడా రైతులు అంటున్నారు.
అదే విధంగ విశాఖ పోర్టుకు కూడా పెద్ద ఎత్తున భూములు ఇచ్చామని, ఇంత చేసినా ఎక్కడా తమకు న్యాయమైన ధర కానీ, నష్టపరిహారం కానీ దక్కలెదని అంటున్నారు. అదే అమరావతి రైతులకు ల్యాండ్ పూలింగులో భారీ లబ్ది కలిగిందని, అయినా వారు రోడ్డెక్కి విశాఖ రాజధాని కాదనడమే దారుణమని విశాఖ రైతులు అంటున్నారు. అందరూ అభివ్రుధ్ధిని పంచుకోవాలన్నదే తమ విధానమనిఈ ప్రాంత రైతాంగం అంటోంది.