ఈవారం ట్రేడ్‌ టాక్‌: బాక్సాఫీస్ మోత

ఆదివారం తర్వాత సంక్రాంతి సినిమాల హవా తగ్గింది. గత వారాంతానికి ముందే 'సరిలేరు నీకెవ్వరు' డ్రాప్‌ అయినా కానీ శని, ఆదివారాలలో మళ్లీ పుంజుకుంది. వీక్‌ డేస్‌లో ఆడియన్స్‌ పెద్దగా లేకపోవడంతో థియేటర్ల వద్ద…

ఆదివారం తర్వాత సంక్రాంతి సినిమాల హవా తగ్గింది. గత వారాంతానికి ముందే 'సరిలేరు నీకెవ్వరు' డ్రాప్‌ అయినా కానీ శని, ఆదివారాలలో మళ్లీ పుంజుకుంది. వీక్‌ డేస్‌లో ఆడియన్స్‌ పెద్దగా లేకపోవడంతో థియేటర్ల వద్ద సందడి తగ్గిపోయింది. సంక్రాంతి సినిమాలు పాతబడడంతో కొత్త సినిమా 'డిస్కోరాజా' ఆకర్షిస్తుందనుకుంటే అదేమో రవితేజ పరాజయ పరంపరలో కలిసిపోయింది.

'అల వైకుంఠపురములో' అంతటా 'నాన్‌ బాహుబలి' రికార్డులని దాటి అల్లు అర్జున్‌ని అందలం ఎక్కించింది. బాహుబలియేతర చిత్రాలకి కొత్త బెంచ్‌మార్క్‌ సృష్టించిన 'అల వైకుంఠపురములో' ఫ్యామిలీ చిత్రాలకి, సంక్రాంతికి వున్న బంధాన్ని మరోసారి బలంగా చాటిచెప్పింది. దీంతో వచ్చే సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలనే కోరిక చాలా మంది హీరోల్లో బలపడింది.

'సరిలేరు నీకెవ్వరు' వంద కోట్లకి పైగా షేర్‌ తెచ్చుకుని మహేష్‌ చిత్రాల్లో నంబర్‌వన్‌ స్థానం ఆక్రమించింది. మహర్షి తర్వాత మరోసారి మహేష్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుకున్నా కానీ 'నాన్‌ బాహుబలి' రికార్డుకి సమీపంలోకి రాకపోవడం అతనికో చిన్న వెలితిగా మిగిలిపోతుంది. పోస్టర్లపై 'నాన్‌ బాహుబలి 2' రికార్డు అంటూ వేసుకున్నారు కానీ వాస్తవానికి 'అల వైకుంఠపురములో' వసూళ్లకీ, దీనికీ మధ్య ముప్పయ్‌ కోట్లకి పైగా వ్యత్యాసముంది.