Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: అశ్వథ్థామ

సినిమా రివ్యూ: అశ్వథ్థామ

సమీక్ష: అశ్వథ్థామ
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌:
ఐరా క్రియేషన్స్‌
తారాగణం: నాగశౌర్య, మెహ్రీన్‌, జిష్షుసేన్‌ గుప్తా, పోసాని కృష్ణమురళి, ప్రిన్స్‌, సర్గున్‌ కౌర్‌, సత్య తదితరులు
కథ: నాగశౌర్య
కూర్పు: గ్యారీ బిహెచ్‌
సంగీతం: శ్రీచరణ్‌ పాకల
నేపథ్య సంగీతం: జిబ్రాన్‌
ఛాయాగ్రహణం: మనోజ్‌ రెడ్డి
నిర్మాత: ఉష ముల్పూరి
దర్శకత్వం: రమణ తేజ
విడుదల తేదీ: జనవరి 31, 2020

'అశ్వథ్థామ'లోని ఎమోషనల్‌ పాయింట్‌ ఇప్పుడు సమాజంలో స్త్రీలపై జరుగుతోన్న దారుణాలని ప్రతిబింబిస్తుంది. మహిళలపై జరుగుతోన్న అకృత్యాలని ఒక ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌లా ఆపరేట్‌ చేసే 'మానవ మృగం' వుంటే, దానిని వేటాడే అశ్వథ్థాముడిగా కనిపిస్తాడు ఇందులోని కథానాయకుడు. నాగశౌర్య స్వీయ కథా రచనలో చేసిన ఈ చిత్రం కోసం అతను పెట్టిన ఎఫర్ట్స్‌ ఖచ్చితంగా మెప్పిస్తాయి. ఇంతవరకు లవర్‌బాయ్‌గా కనిపించిన శౌర్య ఇందులో యాక్షన్‌ హీరోగా కనిపించాడు. అందుకోసం శరీరాకృతి మార్చుకోవడం దగ్గర్నుంచి, పార్కోర్‌ స్టంట్స్‌ వరకు చాలానే చేసాడు.

నాగశౌర్య ఇచ్చిన స్టోరీలో సమకాలీన పరిస్థితులకి అద్దం పట్టే విషయం వుంది. అలాగే ఒక ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ని సీక్రెట్‌గా ఆపరేట్‌ చేయడానికి ఏమి చేస్తే నమ్మశక్యంగా అనిపిస్తుందనే దానికి తగినంత రీసెర్చ్‌ కూడా జరిగింది. అయితే ఈ కథకి ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే రాయడంలో దర్శకుడు రమణ తేజ విఫలమయ్యాడు. ఒక సామాన్యుడు తనకి తెలిసిన పద్ధతులలో ఒక రాక్షసుడిని ఎలా వేటాడి కనిపెట్టాడనేది చూపించడం ఉద్దేశం అయి వుండొచ్చు. అయితే కథానాయకుడి పాత్రకి అంత ఇన్వెస్టిగేషన్‌ చేయడానికి తగిన శిక్షణ లేదా బోధన వున్నట్టు ఒక మాట అనిపించినా కొన్ని నమ్మశక్యం కాని విషయాలని ఓవర్‌లుక్‌ చేయవచ్చు.

చెల్లెలికి అన్యాయం జరిగిందనగానే అన్నయ్య ఆమెని వివిధ దశల్లో వేధించిన వారిని చితగ్గొట్టుకుంటూ వెళ్లిపోవడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. చెల్లెలికి చావు మార్గం కాదని చెప్పి, పెళ్లి కూడా చేసేంత నెమ్మదస్తుడు సడన్‌గా తెలుగు సినిమా హీరోలా అన్నిటికీ 'కొట్టడమే' పరిష్కారం అన్నట్టుగా ముందుకి దూసుకెళ్లిపోతుంటాడు. ఎంతో సీక్రెట్‌గా, పకడ్బందీగా జరుగుతోన్న అమ్మాయిల అపహరణ వ్యవహారాన్ని హీరో అత్యంత కన్వీనియంట్‌గా కనిపెట్టేస్తాడు. అంబులెన్స్‌ల వెంట పడడం అదంతా థ్రిల్‌కి గురి చేయకపోయినా అంతో ఇంతో ఎంగేజ్‌ అయితే చేస్తుంది. మొత్తం మీద ఫస్ట్‌ హాఫ్‌ కొన్ని ఎంగేజ్‌ చేసే మొమెంట్స్‌తో పాటు కొన్ని గ్యాప్‌ ఫిల్లింగ్‌ తరహా సీన్లు, అవసరం లేని పాటలతో ఓవరాల్‌గా ఓకే అనిపించేలా నడుస్తుంది.

కనిపించకుండా దారుణాలు చేస్తోన్న విలన్‌ని రివీల్‌ చేసిన సీన్‌లోనే అతనిపై హేయమైన అభిప్రాయం కలిగించాలనే విధంగా ఒక వికారమైన సన్నివేశంతో అతడిని పరిచయం చేస్తారు. 'ధృవ' సినిమాలోని అరవింద్‌స్వామి పాత్ర కనుక సైకో సెక్స్‌ మేనియాక్‌ అయితే ఎలా వుంటాడో ఇందులోని విలన్‌ (జిష్షుసేన్‌) అలా కనిపిస్తాడు. అతని ఫాదర్‌తో రిలేషన్‌ కూడా కాస్త 'ధృవ'లోని అరవింద్‌స్వామి పాత్రనే తలపుకి తెస్తుంది. వేషధారణ, అభినయం చాలా క్లాసీగా అనిపించే ఈ క్యారెక్టర్‌ ఆపరేట్‌ చేసే విధానం మాత్రం అంత తెలివిగా అనిపించదు. తనది జంతువుల తరహా 'వాంఛ' అని, అది తీర్చుకోవడానికి శవమయినా ఓకే అని పరిచయం చేసుకునే అతను ఫోటోలు పంపించి ఫలానా వారిని కిడ్నాప్‌ చేయమనడం ఏమి లాజిక్కో అర్థం కాదు. అతని ఆలోచనల ప్రకారం అప్పటికప్పుడు ఎవరు దొరికితే వారిని రాండమ్‌గా తీసుకొచ్చినట్టుండాలి కానీ ఫోటోలు పంపించి కిడ్నాపులు చేయమనడం 'వాంఛ'ని జస్టిఫై చేయదు.

అస్సలు ఎవరికీ తెలియకుండా అంతా చేస్తోన్న అతడిని ట్రాక్‌ చేయడం హీరోకి మంచినీళ్ల ప్రాయమైపోతుంది. పాయింట్‌ ఏ టు పాయింట్‌ బి అంతా గూగుల్‌ మ్యాప్‌ డైరెక్షన్ల మాదిరిగా విలన్‌ని రీచ్‌ అయిపోవడం ఆ విలన్‌ తీసుకుంటోన్న జాగ్రత్తకి తగ్గట్టు లేదు. కన్వీనియంట్‌ స్క్రీన్‌ప్లే రాసుకోవడం, బేసిక్‌ సీన్స్‌, సిట్యువేషన్స్‌తో హీరో అతడిని ట్రాక్‌ చేసేయడంతో థ్రిల్‌ మిస్‌ అయి ఫ్లాట్‌ అయిపోతుంది. 'రాక్షసుడు' చిత్రంలో విలన్‌ని పట్టుకోవడం ఒక పోలీస్‌కి కూడా ఎంత కష్టమైపోతుందో ఎంత ఉత్కంఠభరితంగా చూపించారనేది కన్సిడర్‌ చేసి వుండాల్సింది. ఇక సదరు విలన్‌లోని ఆ పైశాచికత్వానికి తగిన కారణమే కనిపించదు. మైథలాజికల్‌ రిఫరెన్సుల మినహా ఆ విలన్‌ ఆలోచనల్లో, ఆచరణలో డెప్త్‌ వుండదు. ఇక మొదట్నుంచీ ఎవరినైనా తన్నుకుంటూ వెళ్లిపోతున్న హీరోకి అంతటి విలన్‌ కూడా ఇట్టే దొరికిపోతాడు. చిన్నపాటి ప్రతిఘటన లేకుండా చేతులెత్తేస్తాడు.

ఒక్కసారి విలన్‌ ఎవరనేది రివీల్‌ అయిన తర్వాత అతను చేసే ఏ పనీ తెలివిగా అనిపించదు. ఈ యాక్ట్‌ కనుక కరక్ట్‌గా రాసుకుని, పకడ్బందీ కథనంతో బిగి సడలకుండా నడిపినట్టయితే ఈ 'అశ్వథ్థామ' నిజంగానే బాక్సాఫీస్‌ పద్మవ్యూహం చేధించి వుండేవాడు.

నాగశౌర్య సిన్సియర్‌ పర్‌ఫార్మెన్స్‌కి తోడు జిష్షుసేన్‌ గుప్తా ఆహార్యం, అభినయం ఈ చిత్రాన్ని కొంతవరకు ఎంగేజింగ్‌ మార్చాయి. నటన పరంగా మిగతా వారి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు... మెహ్రీన్‌తో సహా. సాంకేతిక విభాగంలో నేపథ్య సంగీతం అందించిన జిబ్రాన్‌తో పాటు ఛాయాగ్రాహకుడు ఆ థ్రిల్లర్‌ అట్మాస్ఫియర్‌ క్రియేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాడు. దర్శకుడు రమణ తేజ అడపాదడపా ఉత్కంఠ రేకెత్తించినా కానీ ఓవరాల్‌గా మాత్రం డిజప్పాయింట్‌ చేసాడు.

ఫ్రెష్‌ కాన్సెప్ట్‌ కానీ, ఇంతవరకు మనం చూడని సెటప్‌ కానీ లేని ఈ థ్రిల్లర్‌లో కొన్ని టెన్స్‌ మూమెంట్స్‌ వల్ల ఆసక్తి పూర్తిగా సడలి పోలేదు కానీ మొత్తంగా అయితే ఒక శాటిస్‌ఫ్యాక్టరీ థ్రిల్లర్‌ చూసిన అనుభూతిని ఇవ్వడంలో అయితే అశ్వథ్థామ విఫలమయ్యాడు. ఎంతో చేయడానికి స్కోప్‌ వున్న మెటీరియల్‌ అయినా కానీ అరకొర కథనంతో ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

బాటమ్‌ లైన్‌: అంతంతమాత్రంగా!

గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?