జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద తెలుగుదేశం పార్టీ ప్రేమ ప్రకటన కొనసాగుతూ ఉంది. పవన్ ఎక్కడ ఉన్నా తమ వాడే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అయిపోతూ ఉండటం గమనార్హం. మళ్లీ సినిమాల్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్ తీరును విమర్శిస్తూ ఆ పార్టీకి లక్ష్మినారాయణ రాజీనామా చేయగా.. ఈ విషయంలో పవన్ ను సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీ.. ఆయన తమ వాడే అనే కలరింగ్ ఇస్తూ ఉంది.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. తెలుగుదేశం వీర ప్రముఖులంతా పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లడాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. పవన్ సినిమాలను చేసుకుంటూ రాజకీయాలు చేయాలని వారు ఉచిత సలహాలు పడేస్తూ ఉన్నారు. ఆ వీరాధివీరులే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అంబికా కృష్ణ తదితరులు. పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం గురించి వీరు స్పందించారు. పవన్ కల్యాణ్ నిలకడలేమి స్వభావాన్ని వీరు సమర్థించారు.
ఆ తీరు సరికాదంటూ జనసేనలో పని చేసిన లక్ష్మినారాయణ ఆ పార్టీకి రాజీనామా చేయగా, తెలుగుదేశం పార్టీ వాళ్లు అదే కరెక్ట్ అని అంటున్నారు. పవన్ ఏం చేసినా తెలుగుదేశం పార్టీకి రుచిగానే అనిపించేలా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేసినా టీడీపీ హ్యాపీగా ఫీల్ అయ్యింది. పవన్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులనే చంద్రబాబు నాయుడు అదరగొట్టి కూర్చోబెట్టారప్పుడు.
ఇక పవన్ వెళ్లి ఇటీవల బీజేపీతో చేతులు కలపడం పట్ల కూడా టీడీపీ హ్యాపీగా స్పందించింది. త్వరలోనే తాము కూడా బీజేపీతో చేతులు కలపడానికి పవన్ గ్రౌండ్ రెడీ చేస్తున్నారు అన్నట్టుగా తెలుగుదేశం వాళ్లు రియాక్ట్ అయ్యారు. ఆ పై తను సినిమాలు త్యజించినట్టుగా ప్రకటించుకున్న పవన్ ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు వెళ్లడాన్నీ తెలుగుదేశం సమర్థిస్తూ ఉంది. ఇలా పవన్ ఏం చేసినా తెలుగుదేశం వాళ్లు బాహాటంగా మద్దతు పలుకుతూ.. ఆయన చంద్రబాబుకు దత్తపుత్రుడన్న వైసీపీ విమర్శకు మరింత ఊతం ఇస్తున్నట్టుగా ఉన్నారు.