వంగలపూడి అనిత పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే. మరొక సారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు వద్దే వద్దని తెగేసి చెబుతున్నారు. పట్టువదలని అనిత… టికెట్ కోసం ఎన్నెన్నో పాట్లు పడుతున్నారు. సీఎం జగన్‌ను విపరీతంగా తిడుతున్నారు. మరోవైపు చంద్రబాబు, లోకేశ్‌లను ఆకాశమే హద్దుగా పొగిడేస్తున్నారు.
అతిగా మాట్లాడితే అగచాట్లే తప్ప, ప్రయోజనం ఉండదని పెద్దలు చెప్పిన మాటను అనిత వినిపించుకునే రకం కాదులేండి. ఆమె రూటే సపరేటు. మీడియా ముందు ఓవరాక్షన్ చేస్తే…ఏదో టికెట్ కోసం ఈ విద్యలన్నీ అని సరిపెట్టుకోవచ్చు. సమస్య ఏంటంటే… టీడీపీ కార్యకర్తలు, నాయకులతో అంతకంటే ఎక్కువ ఓవరాక్షన్ చేస్తారనే విమర్శ వుంది. ఇదే ఆమెని ప్రజల్లో చులకన చేస్తోంది. తెగిస్తే పోయేదేముంది… టికెట్ రావడం తప్ప అనే సిద్ధాంతాన్ని ఆమె బాగా ఒంటబట్టించుకున్నట్టున్నారు.
అనిత నిత్యం వార్తల్లో వ్యక్తే. ఇటీవల చిత్తూరు జిల్లాలో లోకేశ్ పాదయాత్రలో ఆమె మాట్లాడుతూ ….జగన్‌ను మనమంతా గెలిపిస్తామన్నట్టు ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే అది మార్ఫింగ్ వీడియో అని, చర్యలు తీసుకోవాలని సైబర్ పోలీసులకు అనిత ఫిర్యాదు చేశారు. వైసీపీకి ఇదేం పని అని కొందరు రాజకీయ తటస్థులు కూడా తప్పు పట్టారు. అయితే తథాస్తు దేవతలు… మార్ఫింగ్ వీడియోను తథాస్తు అని అన్నట్టున్నారు.
సీఎం జగన్‌ను విమర్శించే క్రమంలో ఉత్సాహం ఎక్కువై… అనిత నోరు జారింది. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే…”కలలో కూడా ఈ దొంగోడు ముఖ్యమంత్రి కావాలని అనుకోకూడదు. దయచేసి నేను ఒకటే చెబుతున్నా…రాబోయే కాలంలో జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసే బాధ్యత మనమంతా తీసుకోవాలి” అని వీరావేశంతో అనిత పిలుపునిచ్చారు.
వైసీపీ సోషల్ మీడియా క్రియేటర్స్‌కు ఏ మాత్రం పని లేకుండానే అనిత అద్భుతమైన బైట్ ఇచ్చారు. బహుశా ఇది మార్ఫింగ్ అని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది రియల్ కాబట్టి. జగన్‌ను మళ్లీ సీఎంగా చూడాలని అనిత కలవరిస్తున్నారన్న మాట అంటూ సోషల్ మీడియాలో అనితపై సెటైర్స్ పేలుతున్నాయి. అనితకు కాలం కలిసి రాలేదనేందుకు ఇదే ఉదాహరణ.