నంద్యాల, ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్‌లు, అన్నాచెల్లెలైన భూమా బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియ మధ్య ఓ చేరిక చిచ్చు రేపింది. నంద్యాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు, న్యాయవాది తులసిరెడ్డి ఇటీవల అఖిలప్రియ నేతృత్వంలో టీడీపీలో చేరారు. దీన్ని భూమా బ్రహ్మానందరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో చేరిన సందర్భంగా బ్రహ్మానందరెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడానికి వెళ్లిన తులసిరెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవిచంద్రారెడ్డికి సంబంధించి న్యాయ, పోలీస్ వ్యవహారాలన్నీ తులసిరెడ్డి చూసుకునేవారు. నంద్యాలలో సెటిల్‌మెంట్లు, పంచాయతీలన్నీ ఆయన చేతుల మీదుగానే జరిగేవి. అవి కాస్త శ్రుతిమించడంతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో ఎమ్మెల్యేతో తులసిరెడ్డికి విభేదాలు వచ్చాయి. ముస్లిం మైనార్టీలకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలను ఎమ్మెల్యే పాటించారు.
అయితే తనకు ఆ పదవి ఇవ్వడం ఇష్టం లేకనే సీఎం జగన్ పేరు చెప్పి తప్పించారనే కారణంతో వైసీపీ నుంచి బయటికొచ్చారు. గతంలో భూమా నాగిరెడ్డిని కేసుల్లో ఇరికించడంలో తులసిరెడ్డి కీలక పాత్ర పోషించారని టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. ఆ మేరకు తులసిరెడ్డిని బ్రహ్మానందరెడ్డి దగ్గరికి రానివ్వలేదు. అంతేకాదు, అతని రాకతో వైశ్య, ముస్లింలలో టీడీపీకి వ్యతిరేకత పెరుగుతుందని బ్రహ్మానందరెడ్డి భయపడ్డారు.
అయితే ఇవేవీ పట్టించుకోకుండా తులసిరెడ్డిని అఖిలప్రియ చేర్చుకున్నారని, నష్టం తనకు జరుగుతుందని బ్రహ్మానందరెడ్డి వాదన. దీంతో సోదరి వైఖరిపై బ్రహ్మానందరెడ్డి మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో చేరిన తులసిరెడ్డి మర్యాద పూర్వకంగా బ్రహ్మానందరెడ్డిని కలవడానికి ఇంటికి వెళ్లారు.
తులసిరెడ్డి రాకను టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయని గ్రహించిన బ్రహ్మానందరెడ్డి, తాను వారి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నట్టు చెప్పారు. ఆళ్లగడ్డకు వెళ్లి టీడీపీకి పని చేసుకోవాలని, తనకు మీ అవసరం లేదని మొహం మీదే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ న్యాయవాది తులసిరెడ్డి టీడీపీలో చేరిక బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియ మధ్య గ్యాప్‌ను మరింత పెంచుతోందని చెప్పొచ్చు.