నా కథలోంచి పుట్టిన-శ్రీమంతుడు-మహర్షి

‘’…ఓ అద్భుతమైన కథ తయారు చేసుకున్నా..ఎప్పటికైనా అది చేయాలనుకున్నా..అంతలోనే శ్రీమంతుడు సినిమా వచ్చింది. నా కథలోని ఓ లేయర్ ఎగిరిపోయింది. తరువాత శతమానం భవతి సినిమా వచ్చింది. నా కథలోదే ఇంకో లేయర్. ఇంతలో…

‘’…ఓ అద్భుతమైన కథ తయారు చేసుకున్నా..ఎప్పటికైనా అది చేయాలనుకున్నా..అంతలోనే శ్రీమంతుడు సినిమా వచ్చింది. నా కథలోని ఓ లేయర్ ఎగిరిపోయింది. తరువాత శతమానం భవతి సినిమా వచ్చింది. నా కథలోదే ఇంకో లేయర్. ఇంతలో మహర్షి వచ్చింది. ముచ్చటగా మూడో లేయర్ అది..’’ అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు శ్రీవాస్. 

ఆయన దర్శకత్వం వహించిన రామబాణం సినిమా త్వరలో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవాసు ‘గ్రేట్ ఆంధ్ర’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఓ విశేషం చెప్పారు. తను, రచయిత బివిఎస్ రవి తో కలిసి ఓ మంచి కథ తయారు చేసుకున్నానని, అది దిల్ రాజుకు చెప్పా అని, ఎప్పటికైనా చేద్దాం అనుకున్నాను..కానీ ఇంతలో ఇలా జరిగింది అంటూ చెప్పుకువచ్చారు. అయితే ఇప్పటికీ అందులో కోర్ పాయింట్ అలాగే వుందని, ఎప్పటికైనా అది మంచి సినిమాగా మారుస్తా అని చెప్పారు శ్రీవాస్. ఒక దశలో రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు కూడా చెద్దామనుకున్నా, కానీ మళ్లీ విరమించుకున్నా అన్నారు.

హీరో గోపీచంద్ కు తనకు మధ్య పొరపచ్చాలు వచ్చాయి అన్న వార్తలపై స్పందిస్తూ, డైరక్టర్ ఒకటి అనుకోవడం, హీరో మరోటి అనుకోవడం కామన్ అని, వేరే హీరో అయితే వేరుగా వుండేదని, గోపీచంద్ తో తనకు వున్న సాన్నిహిత్యంతో కాస్త వాదనలు జరగడం అన్నది తప్పదని వివరించారు.

సినిమాకు యాభై కోట్లు ఖర్చయిందన్న కామెంట్ కు సమాధానం ఇస్తూ, యాభై కోట్లు అని తను చెప్పను కానీ, ఖర్చు పెరగడానికి చాలా కారణాలు వున్నాయన్నారు. సినిమా కాస్టింగ్ చూస్తే కొంత వరకు తెలుస్తుంది, సినిమా మేకింగ్ చూసాక పూర్తిగా తెలుస్తుందని అన్నారు.

అందరూ బాలయ్యను లార్జర్ దాన్ లైఫ్ గా చూపించాలనుకుంటారని, దాని వల్ల ట్రోల్స్ వస్తుంటాయని, కానీ తాను మాత్రం డిక్టేటర్ సినిమాలో అలా చూపించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సాక్ష్యం సినిమా తన కెరీర్ లోనే బెస్ట్ సినిమా అని శ్రీవాస్ చెప్పారు. కానీ చాలా ముందుగా తీసేసానని, ఇప్పుడు తీసి వుంటే పెద్ద హిట్ గా మారి వుండేదని అన్నారు.

రామబాణం రొటీన్ కమర్షియల్ కథేనా అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ, రొటీన్ అవునా కాదా అనే కన్నా, సరైన కథనా కాదా అన్నదే కీలకం అన్నారు. అన్నదమ్ముల బంధాలు చూపిస్తూ, ఇటు ఎంటర్ టైన్ మెంట్, అటు యాక్షన్ కలిసిన సినిమా అన్నారు. లక్ష్యం, లౌక్యం సినిమాల తరువాత తాను-గోపీచంద్ కలిసి చేస్తున్న సినిమా అన్నారు.