ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. సీఎం వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. బాలినేని అలక వహించడం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లాలో బాలినేని కీలక నేత. జగన్ మొదటి కేబినెట్‌లో ఆయన చోటు దక్కించుకున్నారు. రెండో కేబినెట్‌లో పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి ఆయన అన్యమనస్కంగానే జగన్ వెంట నడుస్తున్నారు.
తాజాగా ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటనలో బాలినేనికి చేదు అనుభవం ఎదురైంది. ఈబీసీ నేస్తం నిధుల విడుదల నిమిత్తం సీఎం జగన్ మార్కాపురం వస్తున్న సంగతి తెలిసిందే. హెలిప్యాడ్ వద్దకు వెళ్లడానికి బాలినేని సిద్ధమయ్యారు. అయితే ప్రొటోకాల్‌లో బాలినేని పేరు లేకపోవడంతో పోలీస్ అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. వాహనం దూరంగా పెట్టి నడిచి రావాలని సూచించారు.
దీంతో బాలినేని హర్ట్ అయ్యారు. సీఎం జగన్ కార్యక్రమంలో పాల్గొనకుండానే బాలినేని తిరుగు ప్రయాణమయ్యారు. బాలినేనికి సర్ది చెప్పడానికి మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రయత్నించారు. అయినప్పటికీ బాలినేని వినిపించుకోలేదు. బాలినేనితో పాటు ఒంగోలు మేయర్, అనుచరులు కూడా సీఎం జగన్‌కు గైర్హాజరయ్యారు.
సొంత ప్రభుత్వంలో పోలీసుల అత్యుత్సాహంపై వైసీపీలో చర్చకు తెరలేచింది. ప్రతి చోటా ఇదే రీతిలో అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.