భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,830 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 2,154 కేసులు పెరిగాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 40,215కి పెరిగింది.
ఇక 24 గంటల వ్యవధిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,016కి ఎగబాకింది. గత 24 గంటల వ్యవధిలో 4,692 మంది కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 0.09 శాతం యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజూవారీ పాజిటివిటీ రేటు 3.65 శాతం ఉన్నట్లు పేర్కొంది. ఇక రికవరీ రేటు 98.72 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు తెలిపింది.
గత మూడు వారాలుగా దేశంలో కరోనా కేసులు పెరుగుదలకు ఎక్స్‌బీబీ.1.16 లేదా ఆర్ట్కురుస్ గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని వైద్య నిపుణలు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు. ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవాలంటున్నారు.
కాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యికి చేరువయ్యాయి. మంగళవారం 3772 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. దీంతో పాజిటివిటీ రేటు 25.98 శాతానికి పెరిగింది.