బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడులో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్ నేతృత్వంలో ఆత్మీయ సమ్మేళనం తలపెట్టారు.
ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పొంగిలేటి సభలకు భారీగా ప్రజలు వెళ్లారు. దీంతో ఆయనకు పోటీగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కూడా సమ్మేళనాల నిర్వహణకు ముందుకొచ్చారు.
చీమలపాడులో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల రాకతో సందడిగా ఉన్న సమయంలో ఒక్కసారి భారీ శబ్దం. భీతావహ దృశ్యాలు. ఏం జరిగిందో, జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితిలో ప్రజలంతా ఆహాకారాలు, ఏడ్పులు, పెడబొబ్బలు. దట్టమైన పొగలు వ్యాపించాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు బాణా సంచా కాల్చారు. నిప్పు రవ్వలు సమీపంలోని గుడిసెపై పడి మంటలు చెలరేగాయి. మంటల ధాటికి గుడిసెలోని గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలింది.
ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి శవమై తేలాడు. మాంసపు ముద్ద అయ్యాడు. గుర్తు పట్టలేని పరిస్థితి. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి కాళ్లు తునాతునకలయ్యాయి. వీరిలో జర్నలిస్టులు, పోలీసులు ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఖమ్మం ఎంపీ, వైరా ఎమ్మెల్యే దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.