ఎమ్బీయస్‌: విగ్రహారాధన

విగ్రహారాధన అనేది హిందువులకు కొండగుర్తు అని భావిస్తాం. కొన్ని గుళ్లల్లో శివుడు ఆకాశరూపంలో ఉన్నాడని చెప్పినా, వాటిలోనూ మూర్తులు ఉంటాయి. కొందరైనా నిరాకారంగా ఉన్న దేవుణ్ని పూజించేవారనే దానికి తార్కాణంగా బోడిగా ఉన్న శివలింగాన్ని…

విగ్రహారాధన అనేది హిందువులకు కొండగుర్తు అని భావిస్తాం. కొన్ని గుళ్లల్లో శివుడు ఆకాశరూపంలో ఉన్నాడని చెప్పినా, వాటిలోనూ మూర్తులు ఉంటాయి. కొందరైనా నిరాకారంగా ఉన్న దేవుణ్ని పూజించేవారనే దానికి తార్కాణంగా బోడిగా ఉన్న శివలింగాన్ని చూపించేవారు. పోనుపోను లింగానికి కూడా అలంకారాలు వచ్చేశాయి. ఆకారం లేదంటే ఏకాగ్రత కుదరదని అందుకని దేవుడికి ప్రతీకగా ఏదో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠాపించుకోవాలని చాలామంది అంటారు. కళ్లు మూసుకుని ధ్యానం చేసుకునేటప్పుడు కొందరు ఏదో ఒక దేవుడి ఆకారాన్ని ఊహించుకోమంటారు. మరి కొంతమంది అబ్బే, ఆకారం ఉండకూడదు, అసలు మనసులో ఆలోచనే ఉండకూడదు అంటారు. కొందరు మధ్యేమార్గంగా జ్యోతిని ఊహించుకోమంటారు. 

ప్రపంచంలో అనేక మతాల్లో విగ్రహారాధన ఉంది. ప్రాచీన మతాల్లో యిది విధిగా ఉంది. అయితే నేటి ప్రపంచంలో ప్రధాన మతాలైన యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాలు విగ్రహారాధనను నిరసిస్తాయి. ఈ మూడు గౌరవించే బైబిల్‌ పాత గ్రంథం (ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌)లో దేవుడు తన ప్రజలకు విగ్రహారాధనకులను నాశనం చేయమని పదేపదే చెపుతూంటాడు. తన పోటీ దేవుడు బాల్‌ విగ్రహాలను పూజించిన వాళ్లను శిక్షిస్తూ ఉంటాడు. ఇస్లాం అవతరించాక వారు దాడి చేసిన దేశాల్లో అనేక విగ్రహాలను భంగం చేశారు. విగ్రహారాధకులను విశ్వాసహీనులుగా (కాఫిర్‌) చూశారు. విగ్రహారాధన లేదంటూనే క్రైస్తవుల చర్చిల్లో అనేక విగ్రహాలు కనబడతాయి. వాటి ముందు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ ఇస్లాంలో మాత్రం విగ్రహాల ప్రసక్తే లేదు. ప్రవక్త బొమ్మ గీసినా వారు ఊరుకోరు.

మన హిందూమతం ప్రాచీనమైనది కాబట్టి దానిలో విగ్రహారాధన ఉండడంలో అసహజమైనది ఏదీ లేదనిపిస్తుంది. కానీ ప్రస్తుతం నేను చదువుతున్న ''సత్యార్థ ప్రకాశము'' పుస్తకంలో కాదని రాస్తే చాలా ఆశ్చర్యమేసింది. ఇది రాసినాయన ఆర్యసమాజ్‌ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతి (1824-1883). హిందూ మతాన్ని సంస్కరించిన ప్రవక్త. ఆయన అనుయాయులు దేశమంతా ఉన్నారు. ఆయన అనేక మతాలను, భారతీయ ప్రాచీన గ్రంథాలను క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేశారు. ఆయన రాసిన పుస్తకాల్లో చాలా పేరున్న గ్రంథం ''సత్యార్థ ప్రకాశము.'' పండిత గోపదేవ్‌ శాస్త్రి అనే ఆయన 1928లో తెలుగులోకి అనువదించారు. దీనిలో 14 అధ్యాయాలున్నాయి. సముల్లాసము అని పేరు పెట్టారు. ప్రశ్నోత్తరాల రూపంలో దయానంద తన భావాలను, అభిప్రాయాలను, వ్యాఖ్యానాలను వ్యక్తం చేశారు. 

ఆయన వేదాన్నే ప్రమాణంగా తీసుకున్నారు. వాటి ప్రకారమే హిందువులందరూ నడుచుకోవాలన్నారు. తర్వాతి కాలంలో వచ్చిన పురాణాలు, యితర వ్యాఖ్యానాల వలన, యితరమతాల ప్రభావం వలన ప్రజలు తప్పుదోవ పట్టారని, మళ్లీ వైదిక కాలానికి మళ్లాలని ఉద్బోధించారు. ఆర్యసమాజ్‌ పెళ్లిళ్లలో (ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకునే జంటల వలన ఆర్యసమాజ్‌ పేరు వార్తల్లోకి ఎక్కుతూ ఉంటుంది కానీ, పెద్దలు కుదిర్చిన కొన్ని పెళ్లిళ్లు ఆ పద్ధతిలో జరగడం చూశాను) అగ్నిసాక్షిగా జరుగుతుంది. వధూవరుల చేత ప్రమాణాలు చేయిస్తారు. గంటన్నర, రెండు గంటల్లో వివాహం అయిపోతుంది. వేదాల్లో అంతే ఉందట. 'తాళి కట్టనవసరం లేదు, లోకాచారం కొద్దీ కట్టిస్తున్నాం' అని చెప్పి 'మాంగల్యం తంతునా..' మంత్రం లేకుండానే కట్టిస్తారు.

దయానంద ఆ పుస్తకంలో జైన, బౌద్ధ, చార్వాక, క్రైస్తవ, మహమ్మదీయ మతాలను విమర్శించారు. వాటిలో వైరుధ్యాలను ఎత్తి చూపారు. పాపపరిహారం చేస్తామంటూ క్రైస్తవ పోపులు ఎలా అయితే ధనార్జన చేశారో, అదే విధంగా హిందూ పోపులు వెలిశారు అంటూ వెక్కిరించారు. పుణ్యక్షేత్రాలంటూ చేసే ప్రచారమంతా స్థానికుల ఆదాయం కోసమే అని చెప్పారు. కాశీ, మధుర, బృందావనం, హరిద్వార్‌ యిత్యాది తీర్థస్థానాలన్నీ వ్యాపారకేంద్రాలై పోయాయి అంటూ గయలో పిండం వేస్తే పితరులు వచ్చి చేయిచాచి తీసుకుంటారనేది పూజారుల మాయ అన్నారు. రామేశ్వరం గుడి రాముడు స్థాపించినది కానే కాదు, రావణవధ తర్వాత రాముడు డైరక్టుగా అయోధ్యకు వచ్చేశాడంటూ వాల్మీకి రాశాడని గుర్తు చేశారు. దక్షిణాదికి చెందిన రాముడు అనే రాజెవరో ఆ లింగాన్ని ప్రతిష్ఠాపించి వుంటారని తార్కికంగా చెప్పారు.

ఇక పురాణాల గురించి వ్యాఖ్యానిస్తూ – జయవిజయుల కథను పరిహసించారు. వైకుంఠంలో క్రోధానికి తావు లేదని, తమను అడ్డగించినవారిపై సనకసనాదులకు కోపం ఎలా వస్తుందన్నారు. అయినా తమ డ్యూటీ తాము చక్కగా నిర్వర్తించిన జయవిజయులను విష్ణువు వెనకేసుకుని రాకుండా, భూలోకానికి పంపివేయడమేమిటన్నారు. కశ్యపుడి భార్యల్లో ఒకరికి పాములు, మరొకరికి పక్షులు, యింకోరికి ఏనుగులు, మరొకరికి చెట్లు పుట్టమేమిటని పరిహసించారు. ''పురాణాల్లో అధిక విషయాలు అసత్యాలు. కొన్ని ఘుణాక్షర న్యాయంతో సత్యాలు ఉన్నాయి. సత్యాలైనవి వేదాది సత్యశాస్త్రాలు. వాటిలోని మిథ్యావిషయాలు హిందూ పోపుల పురాణాలుగా మారాయి.'' అన్నారు. 

ఇక్కడ ఘుణాక్షర న్యాయాన్ని (న్యాయం అంటే లా, లేదా ప్రిన్సిపుల్‌, ఇలాటివి చాలా ఉంటాయి) విశదీకరించాలి. తాటాకు గ్రంథాలను కొన్ని క్రిములు తినేస్తాయి. ఆ తినేటప్పుడు చుక్కచుక్కలుగా ఒక పేటర్న్‌ ఏర్పడుతుంది. ఒక్కోప్పుడు అది గంటంతో రాసిన అక్షరంలా తోస్తుంది. అంతమాత్రం చేత ఆ క్రిమి పెద్ద కవి అని, కావాలనే అలా రాసింది అని అనుకోకూడదు. ఏదో సకృత్తుగా, అనుకోకుండా ఏదైనా మంచి జరిగితే దానికి వెనక ఏదో పెద్ద కారణం ఉందని అనుకోవడానికి వీలులేదు అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు. పురాణాల్లో ఏదైనా సత్యం ఉందంటే అది యాదృచ్ఛికంగా, అన్‌యిటెన్షనల్‌గా ఉంది తప్ప కావాలని ఎవరూ రాయలేదు అని దయానందుల భావం. 

సృష్టికర్త శివుడని, శివపురాణం, విష్ణువని విష్ణుపురాణం, దేవి అని దేవీభాగవతం చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ఫలానావాడు సృష్టికర్త అంటే అతనెలా పుట్టాడన్న ప్రశ్న వస్తుందన్నారు. పుట్టినవాడు సృష్టికర్త ఎలా కాగలడు? అని అడిగారు. వేదవ్యాసుడు 18 పురాణాలు ఒక్క చేతిమీద రాశాడని చెప్పడం అసహజమన్నారు. వ్యాసుని తండ్రితాతలైన పరాశర, శక్తి, వసిష్ఠ, బ్రహ్మ వేదాలను చదివారు కాబట్టి వాళ్ల వారసుడైన వ్యాసుడు వేదాలన్నీ పోగుచేశాడు, ఏకం చేశాడు అనే స్టేడ్ణటుమెంటు అబద్ధమని తేలుతోంది అన్నారు. ఎవరెవరో ఏదేదో రాసేసి, క్రెడిబిలిటీ కోసం పూర్వీకుల పేర్లు పెట్టేశారన్నారు. యాగాగ్నిలో పడవేసిన మేకలకు స్వర్గప్రాప్తి కలుగుతుంటుందన్న చెప్పే యాగకర్త తనే హోమగుండంలో పడవచ్చుగా అని అడిగారు. 

పురాణాలన్నీ చిత్తం వచ్చినట్లు రాసేశారని, వాటిని నమ్మడానికి లేదనీ ఆయన వాదన. వేదాలను మాత్రమే స్వీకరించాలని, దానికి దగ్గరగా ఉన్న మనుస్మృతిని గౌరవించాలని అన్నారు. మళ్లీ దానిలో ఉన్న ప్రక్షిప్తానలను పట్టించుకోకూడదన్నారు. వేదాల్లో విగ్రహారాధన లేదని, అందువలన హిందువులు విగ్రహాలను పూజించకూడదనీ అంటారాయన. జైనులు తమ తీర్థంకరులకు ఏర్పరచిన విగ్రహాలను చూసి గత 2500, 3000 సంవత్సరాల క్రితం నుంచి హిందువుల్లో విగ్రహారాధన మొదలైందని ఆయన వాదన. మూర్తిపూజే కాదు, తీర్థయాత్రలు కూడా సనాతన ధర్మంలో లేవంటారు. అవి సృష్ట్యాది నుంచి వస్తూ ఉంటే వేదాల్లో కానీ, ఋషికృత బ్రాహ్మణ గ్రంథాల్లో కానీ వీటి పేర్లయినా లేవేం? జైనులు గిరినార్‌, పాలిటానా, ఆబూ వంటి తీర్థస్థానాలు ప్రారంభించాకనే వామమార్గులు, హిందూపోపులు వీటిని ఏర్పరచారంటారాయన. 

పుస్తకం మొత్తమంతా గురుశిష్య సంవాదంగా సాగుతుందని చెప్పాను కదా. ఆయన అలా అనగానే ఆయన శిష్యుడు అడుగుతాడు – వేదాల్లో పలు శాఖలు ఉన్నాయి. ఋగ్వేదంలో 21, యజుర్వేదంలో 101, సామవేదంలో 1000, అధర్వణవేదంలో 9 ఉన్నాయి కానీ వాటిల్లో కొన్ని మనకు అలభ్యంగా ఉన్నాయి. ఆ అలభ్యమైన వాటిల్లో విగ్రహారాధన గురించి, తీర్థాల గురించి ఉందని ఎవరైనా వాదించవచ్చు కదా! అని. దానికి ఆయన సమాధానమిస్తూ – ''కొమ్మలు వేరే వేరే ఉన్నా మూలవృక్షం లాగానే ఉంటాయి తప్ప విరుద్ధంగా ఉండవు. దొరికే వాటిల్లో వీటి ప్రసక్తి లేదు. లుప్తశాఖల్లో ఉంటాయని ఎందుకు అనుకోవాలి?  అలా అనేవారు వాటిని చూపించాలి.

''వేదాలు అపౌరుషేయాలు, పరమేశ్వర కృతాలు అని అంగీకరిస్తున్నప్పుడు, ఆశ్వలాయనాది ఋషికృత గ్రంథాలను వేదాలుగా ఎందుకు అంగీకరిస్తున్నాం? ఎందుకంటే అవి మూలానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి! కొమ్మలను, ఆకులను చూసి చెట్టును గుర్తు పట్టినట్లుగానే ఋషులచే, మునులచే రాయబడిన వేదాంగాల వలన, నాలుగు బ్రాహ్మణముల వలన, అంగములు, ఉపాంగములు, ఉపవేదములు వాటి వలన వేదార్థాన్ని తెలుసుకోగలుగుతాం. వేదాలకు విరుద్ధమైనవి ప్రమాణాలు కావు. జైమిని రాసిన మీమాంసలో సమస్త కర్మకాండం, పతంజలి యోగశాస్త్రంలో రాసిన సమస్త ఉపాసనా కాండం, వ్యాసుడు రాసిన శారీరక సూత్రాలలో ఉన్న సమస్త జ్ఞానకాండం – యివన్నీ వేదాలకు అనుకూలంగా రాయబడ్డాయి. వాటిల్లో శిలామూర్తుల పూజ కానీ, ప్రయాగాది తీర్థాల విషయం కానీ నామమాత్రానికైనా రాయలేదు.'' అని విశదీకరించారు.  

'తలిదండ్రులు బ్రాహ్మణులైనంత మాత్రాన లేదా ఎవరైనా సాధువుకు శిష్యులైనంత మాత్రాన కానీ ఎవరూ బ్రాహ్మణులు, సాధువులు కాలేరు. ఉత్తమగుణకర్మ స్వభావాల చేత, పరోపకారం చేత బ్రాహ్మణులు, సాధువులు అవుతారు. రాజులు విద్యావిహీనులైనప్పుడు కొందరు బ్రాహ్మణనామధారులు తమలో తాము కూడబలుక్కుని వారి వద్దకు వెళ్లి 'బ్రాహ్మణులను దండించకూడదు' అనే హితవాక్యాలను తమకు తాము అన్వయింప చేసుకున్నారు. అబద్ధాలతో గ్రంథాలు రాసి, ఋషులు, మునుల పేర్లు వాటిలో చొప్పించి, వారి పేర్లతో వినిపించారు. ఆ విధంగా తాము తప్పులు చేసినా శిక్ష నుంచి తప్పించుకున్నారు. ఇలాటి అనర్థాలు మహాభారతయుద్ధం జరగడానికి ఒక వెయ్యి సంవత్సరాల ముందే ప్రారంభమయ్యాయి. ఎందుకంటే అప్పటికే ఆర్యావర్తంలో ఋషులు, మునులు లోపించారు.' అని స్పష్టంగా చెప్పారు. 

వీటిని తర్కించి, నిజానిజాలు తేల్చేటంత జ్ఞానం నాకు లేదు. ఆయన వాదనలు మీకు చేరవేసేనంతే! ఇంకా విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి మీకుంటే, పుస్తకం కొనుక్కుని చదవండి. 1/4 క్రౌన్‌ సైజులో 522 పేజీలుంది. ఆనాటి గ్రాంథిక భాషలో రాశారు. ఆర్యసమాజ్‌ కార్యాలయాల్లో దొరుకుతుంది. ధర 55 రూ.లే.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2020)
   [email protected]