తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని సామెత. పవన్ కళ్యాణ్ పరిస్థితి అలాగే వుంది. భాజపాను తేదేపాను దగ్గర చేయాలని, ఆంధ్రలో కమ్మ-కాపు రాజకీయం చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచన. నేరుగా కాపులకే చెప్పారు..కాస్త వెనక్కు తగ్గి అందరినీ అక్కున చేర్చుకోండి అని.
ఓట్ బ్యాంక్ చీలకుండా వైకాపాను ఓడించాలన్నది పవన్ బహిరంగ ఆలోచన. అలా ఓడించి అధికారం ఎవరికి ఇస్తారు. తాను ఎలాగూ 175 చోట్ల పోటీ చేయరు. అంటే తెలుగుదేశం పార్టీ కేగా లబ్ది. కానీ అనుభవం పండిన భాజపా పెద్దల ఆలోచన మరోలా వుంది. కమ్మ-కాపు కలిస్తే జనసేన పవర్ లోకి రాదు. తెలుగుదేశం పంట పండుతుంది. అదే కనుక రెడ్డి-కాపు కలిస్తే భాజపా అధికారంలోకి వచ్చే అవకాశం వుంది అన్నది ఆ పార్టీ ఆలోచన. నిజానికి ఇది చాలా వరకు సరైన ఆలోచన కూడా.
కమ్మ ఓటు బ్యాంక్ ఎప్పటికీ పదిలంగా వుంటుంది. తెలుగుదేశం పార్టీకి తప్ప మరో వైపు ఆ ఓటు వెళ్లదు. అందువల్ల భాజపాకు ఎప్పటికీ ఆ ఓటు బ్యాంక్ రావడం అన్నది చాలా అద్భుతం జరిగితే తప్ప సాధ్యం కాదు. పైగా వెంకయ్య నాయకుడు అస్త్ర సన్యాసం చేసిన తరువాత కమ్మ నాయకులు భాజపాలో స్తబ్దుగా వుండిపోయారు. ఆయన ఫుల్ యాక్టివ్ గా వున్నన్నాళ్లు వారిదే హవా. భాజపా కీలక పదవులు, అధికార పదవులు వారికే అప్పగించిన వైనం వుంది. ఇక ఇప్పుడు అంత సీన్ లేదు.
కానీ రెడ్ల ఓట్ బ్యాంక్ సాలిడ్ కాదు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ గా మారింది తప్ప వేరు కాదు. జగన్ తో సరిపడని రెడ్డి నాయకులు చాలా మంది వున్నారు. వాళ్లంతా ఆల్టర్ నేటివ్ కోసం చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆల్టర్ నేటివ్ అనుకున్నా, అటు వెళ్లలేని వారు కూడా వున్నారు. ఇప్పుడు వాళ్లందరికీ భాజపా ఆల్టర్ నేటివ్ అవుతుంది. పైగా దక్షిణ, తూర్పు కోస్తాల్లో కమ్మ-కాపు వైరుధ్యం వుంది కానీ కాపు-రెడ్డి వైరుధ్యం లేదు. అందువల్ల రెండు కులాలను హ్యాండిల్ చేయడం అంత సులువు అవుతుంది.
పైగా బిసి ల కోసం ఇటు తెలుగుదేశం అటు వైకాపా కిందా మీదా అవుతున్నాయి. అలాంటపుడు కాపులను- రెడ్లను దగ్గర చేయడం అన్నది మంచి స్ట్రాటజీ అవుతుంది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి-పవన్ కలిసి పనిచేయడం అన్నది ఎంత వరకు సాధ్యం అవుతుందన్నది చూడాలి. ఎందుకంటే రాజకీయంగా అనుభవం పండిన వారు ఒకరు. అస్సలు అనుభవం లేని వారు ఇంకొకరు.
ఇదిలావుంటే అసలు పవన్ ను నమ్మలేకనే కిరణ్ కుమార్ రెడ్డిని దగ్గరకు తీసారా భాజపా నాయకులు అనే అనుమానం కూడా వినిపిస్తోంది. అదే జరిగి పవన్ వెళ్లిపోయి కేవలం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే మిగిలితే భాజపాకు ఏమంత ప్రయోజనం వుండదు. బహుశా ఏదో విధంగా పవన్ ను అక్కడే వుంచి, కిరణ్ కుమార్ రెడ్డిని జతచేసి ముందుకు నడిపించడానికే భాజపా ప్రయత్నిస్తుంది. అప్పుడు భలే గమ్మత్తుగా వుంటుంది.
కమ్మ..రెడ్డి…కాపు-రెడ్డి ఇలా మూడు ఈక్వేషన్ల పార్టీలు తెలుగునాట తమ తమ బలం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాయి.