తెలిసి తెలిసి మునిగిపోయే పడవ ఎవరైనా ఎక్కుతారా.? అంటే, ఏమో.. రాజకీయాల్లో ఇలాంటివి కూడా సాధ్యమేనని గతంలో చాలా సంఘటనలు నిరూపించాయి. ఏమో, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తెలుగుదేశం పార్టీ గూటికి చేరతారేమో.! జనసేన పార్టీకి ఆయన రాజీనామా చేయడం వెనుక ఆంతర్యం అదేనేమో.! ఇంతకీ, జేడీ లక్ష్మినారాయణ మనసులో ఏముంది.? ఆయన మనసులో ఏముందోగానీ, తెలుగుదేశం పార్టీ మాత్రం ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానించేస్తోంది.
'ఆయన నిజాయితీపరుడు.. డబ్బుకి ఆశపడే మనిషి కాదు.. ఉన్నతోద్యోగం వదులుకుని ప్రజలకు సేవ చేసేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చారు.. రాష్ట్రం ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో అలాంటి నాయకులు అవసరం.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నాను..' అంటూ టీడీపీ నేత ఒకరు ఈ రోజు ఓ ఛానల్ చర్చా కార్యక్రమం సాక్షిగా జేడీని, టీడీపీలోకి ఆహ్వానించేయడం గమనార్హం.
పలువురు టీడీపీ నేతలు ఇదే ఆలోచనతో వున్నారు.. తమ ఆలోచనల్ని బయటపెడ్తున్నారు కూడా. వెంటనే జేడీ వద్దకు వెళ్ళి ఆయనతో చర్చలు జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ ముఖ్య నేతల్ని ఆదేశించారట. జెడి లక్ష్మినారాయణకి గతంలో టీడీపీతో సన్నిహిత సంబంధాలున్నాయంటారు చాలామంది. ఆ కారణంగానే జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన అంత 'ఓవర్ యాక్టివ్' అయ్యారనే విమర్శలూ వెల్లువెత్తాయి.
కాగా, ఉద్యోగానికి లక్ష్మినారాయాణ రాజీనామా చేయడానికి బీజేపీనే కారణమనీ, ఏపీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటితమవుతుందనీ అప్పట్లో ప్రచారం జరిగిన విషయం విదితమే. లోక్సత్తా పార్టీని ఆయన చేతుల్లో పెట్టేందుకూ అప్పట్లో చాలా ప్రయత్నాలు జరిగాయి. సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన వుందనీ జేడీ లక్ష్మినారాయణ స్వయంగా చెప్పారనుకోండి.. అది వేరే విషయం.
చివరికి జనసేన పార్టీలో ఎన్నికలకు ముందర చేరారు.. ఎన్నికలయ్యాక కొన్నాళ్ళు పార్టీ కార్యకలాపాలతో అంటీ ముట్టనట్లు వ్యవహరించి, నిన్ననే రాజీనామా చేశారు జేడీ లక్ష్మినారాయణ. మరి, ఆయన టీడీపీలోకి వెళతారా.? బీజేపీ వైపుకు ఆకర్షితులవుతారా.? లోక్సత్తా బాధ్యతలు తీసుకోవడమో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టడమో చేస్తారా.? వేచి చూడాల్సిందే.