హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రాజకీయాలంటే సినిమా అనుకుంటున్నారు. ఈల వేస్తే, తొడ కొడితే, మీసం తిప్పితే, సైగ చేస్తే భయపడి పారిపోవడానికి సినిమాలో అయితే చెల్లుతుంది. అంతే తప్ప నిజ జీవితంలో అలాంటివి కుదరవు.
తన నియోజకవర్గమైన హిందూపురంలో గురువారం పర్యటించిన బాలయ్యకు రాజధాని సెగ తగిలింది. ‘గో బ్యాక్ బాలకృష్ణ’ అంటూ నినాదాలు ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణకు టీడీపీ అడ్డుపడుతుండటంతో ప్రజాసంఘాల నేతలు, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ముందుగానే హెచ్చరించినట్టు ఆయన్ను అడ్డుకున్నారు.
దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకున్నాయి. పోలీసులు అతికష్టం మీద బాలయ్యను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఈ వ్యవహారంపై శుక్రవారం తన బాకా చానల్‌తో బాలయ్య మాట్లాడుతూ ‘నేను నిన్న సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేది. చట్టంపై మాకు గౌరవం ఉంది’ అని హెచ్చరిస్తూనే వినయాన్ని ప్రదర్శించాడు.
తనకు, తన కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన కరవు ప్రాంతమైన రాయలసీమ సమాజ ఆకాంక్షను పరిగణలోకి తీసుకోకపోగా, తిరిగి ఆ ప్రాంత వాసులను హెచ్చరించడం బాలయ్య సంస్కారానికి నిదర్శనం. బాలకృష్ణ సైగ చేస్తే ఏమయ్యేదో కానీ, నిన్న అక్కడి ప్రజలకు కన్నెర్ర చేసి ఉంటో బాలకృష్ణ పరిస్థితి ఊహకు అందదు.
కానీ హిందూపురం ప్రజలకు చట్టంపై గౌరవం ఉండటం వల్లే శాంతియుతంగా నిరసన తెలిపారు. మూడు రాజధానులకు అడ్డు తగలవద్దని వేడుకున్నారు. అంతే తప్ప ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే….ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడే ఏ ఒక్క రాజకీయ నాయకుడు తిరగలేడనే వాస్తవాన్ని గ్రహించి మాట్లాడటం ఉత్తమం.