పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించవలసిన వాటిల్లో ఏపీ శాసన మండలి రద్దు తీర్మానం కూడా ఒకటి. అసెంబ్లీ ఆమోదించి పంపిన తీర్మానం కాబట్టి, దీనిపై పెద్దగా చర్చలేకుండానే పార్లమెంట్ ఆమోద ముద్రవేసి రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడే ఓ చిన్న తకరారు. ఇదే సమావేశాల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లపై చర్చ జరగొచ్చు. విపక్షాలన్నీ బీజేపీని టార్గెట్ చేయొచ్చు.
ఇప్పటికే వైసీపీ పార్లమెంటరీ పార్టీ మైనార్టీలకు వ్యతిరేకంగా తెచ్చే ఏ బిల్లుకైనా మేం వ్యతిరేకం అని కుండబద్దలు కొట్టింది, మరోవైపు విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయాలని పట్టుబడుతోంది, ప్రత్యేక హోదాతో సహా. ఇలాంటి టైమ్ లో ఇవి కచ్చితంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టే అంశాలే. తాను పట్టుదలతో తెచ్చిన సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ కి తొలుత మద్దతు తెలిపి, ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నామంటే కేంద్రం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది. వ్యతిరేకించే పార్టీలన్నిటిపై దుష్ప్రచారానికి దిగుతోంది.
అంటే బీజేపీ, వైసీపీ మధ్య సీఏఏ నిప్పురాజేసిందనే విషయం స్పష్టమవుతోంది. తాను తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ బాహాటంగా చెబుతున్న వైసీపీకి బీజేపీ ఏ విషయంలోనైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది. ఏపీ శాసన మండలి వ్యవహారం కూడా ఇందులో భాగమే కదా. మండలి రద్దయితే వైసీపీ నిర్ణయానికి మద్దతిచ్చినట్టు అవుతుంది కాబట్టి, సీఏఏని బూచిగా చూపి వైసీపీతో కేంద్రం బేరానికి దిగొచ్చు.
అయితే మైనార్టీల విషయంలో రాజీ పడేది లేదని జగన్ తెగేసి చెప్పడంతో బీజేపీకి మరో ప్రత్యామ్నాయం ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో వైసీపీపై కక్షతో అయినా ఇతర రాష్ట్రాల మండలి రద్దు తీర్మానాలను తొక్కిపెట్టినట్టు.. ఏపీ మండలి రద్దు వ్యవహారాన్ని కూడా నాన్చే అవకాశం ఉంది. మొత్తమ్మీద మైనార్టీల కోసం, జగన్ మండలి రద్దు విషయంపై రాజీపడాల్సి వస్తుందని అర్థమవుతోంది.