కేంద్రంలోని బీజేపీ పెద్దలతో జనసేనాని పవన్ కల్యాణ్ కు మంచి సయోధ్య ఉంది, ప్రధాని మోదీని పొగడటానికి ఆయన ఏమాత్రం మొహమాట పడరు. అదే సమయంలో రాష్ట్ర నాయకత్వంతో పవన్ కు చాలా విభేదాలున్నమాట కూడా వాస్తవం.
అందుకే అమరావతి రైతుల గురించి కొంతమంది చీప్ గా మాట్లాడారంటూ పరోక్షంగా బీజేపీ నాయకుల్ని టార్గెట్ చేశారు పవన్. రైతులు బంగారం వేసుకోకూడదా, ఉద్యమం చేసేటప్పుడు చిరిగిన బట్టలు వేసుకోవాలా అంటూ లాజిక్ తీశారు.
ఆ సంగతి పక్కనపెడితే బీజేజీ అగ్రనాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అంటూ వేరు చేసి మాట్లాడుతూ కొత్త సంప్రదాయానికి తెరతీశారు పవన్. బీజేపీ అగ్రనాయకత్వం కూడా అమరావతినే రాజధానిగా చూస్తున్నామంటూ స్పష్టంగా చెప్పిందని అన్నారు పవన్.
బీజేపీ ఒక స్టేట్ మెంట్ ఇచ్చినప్పుడు దానిపై నిలబడి ఉంటుందని, ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్న విషయం మన పార్టీ పరిధిలోనిది కాదు అని జనసేన మీటింగ్ లో తేల్చి చెప్పేశారు పవన్ కల్యాణ్.
అంటే రాష్ట్ర నాయకత్వం కేంద్రం మాటల్ని సరిగ్గా జనంలోకి తీసుకెళ్లడం లేదనేది పవన్ ఆరోపణ. అమరావతి ఏకైక రాజధాని అని కేంద్ర నాయకత్వం చెప్పినా, రాష్ట్ర నాయకులు మాత్రం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపడంలేదని పవన్ ఆరోపిస్తున్నారు.
అదే సమయంలో ఉద్యమకారులపై సెటైర్లు వేయడాన్ని కూడా పవన్ తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్ర నాయకత్వం బాగా పనిచేస్తున్నా.. రాష్ట్రంలో నాయకత్వ లోపం ఉందనేది పవన్ వాదన.
తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఏపీ బీజేపీ నాయకుల తీరుతో పవన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారనే మాట వాస్తవం. తనను సంప్రదించకుండా తిరుపతిలో మీటింగ్ లు పెట్టుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నిలబడతామంటూ బీజేపీకి షాకిచ్చారు.
అదే సమయంలో కేంద్ర నాయకత్వానికి తాము విధేయులమనే సిగ్నల్స్ కూడా బలంగా పంపిస్తున్నారు పవన్. అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీ అగ్రనాయకత్వం తమకు చెప్పిందని, అదే తమ పార్టీ స్టాండ్ అని చెబుతున్న పవన్ కల్యాణ్.. మరి రాష్ట్ర నాయకత్వాన్ని ఎందుకు కలుపుకొని వెళ్లడంలేదో అర్థం కావడంలేదు.
మొత్తమ్మీద జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులతో మీటింగ్ పెట్టుకున్న పవన్ కల్యాణ్.. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని బాగానే టార్గెట్ చేశారు. కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అంటూ విభజిస్తూ.. లోకల్ లీడర్లను పట్టించుకునేది లేదని తేల్చి చెప్పారు. తాను మోదీకి జవాబుదారీగా ఉంటాను కానీ, స్థానిక నాయకులను లెక్కచేయబోనని అంటున్నారు పవన్.