జనసేనాని పవన్‌కల్యాణ్‌పై టీడీపీ అక్కసు మరోసారి బయటపడింది. పవన్ చేసిన తప్పల్లా …నిన్న తనను కలిసిన అమరావతి పరిరక్షణ సమితి నేతలతో తన మనసులో మాటను నిర్భయంగా పంచుకోవడమే.
మూడు రాజధానుల విషయమై జగన్ సర్కార్ ఊరికే ప్రకటించిందని, ఇంకా ఆన్ రికార్డ్‌గా చెప్పలేదని, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే తాను కార్యాచరణ ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే… అమరావతిలో రాజధాని ఉండదని జగన్ ప్రభుత్వం చెప్పడం లేదు కదా అని అమరావతి పరిరక్షణ సమితి నేతలను ఆయన ఎదురు ప్రశ్నించారు.
అమరావతిపై పవన్ తాజా వ్యాఖ్యలు టీడీపీతో పాటు ఎల్లో మీడియాకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. పవన్‌కల్యాణ్‌పై పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఓ చానల్‌తో టీడీపీ నేత, తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్‌కల్యాణ్ చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారన్నారు. రాజధాని అమరావతి విషయంలోనూ, అలాగే తన పార్టీని కొనసాగించడంపైనా ఆ కన్ఫ్యూజన్ స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనానిపై టీడీపీ నేత ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది.
ఇంకా ఆయన పవన్‌పై ఏం మాట్లాడారో తెలుసుకుందాం.
రాజధానిని మూడు ముక్కలు చేస్తామని వైసీపీ, రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఒకవైపు రాజధానిపై వాళ్లంతా అంత స్పష్టంగా చెబుతుంటే పవన్‌కల్యాణ్ మాట్లాడుతున్న మాటలు గందరగోళపరుస్తున్నాయన్నారు.
పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే, వందశాతం అమరావతి రైతులపై సానుభూతి ఉంటే ఇలా మాట్లాడే వారు కాదన్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించి, అందర్నీ ఒకచోటికి పిలిచి తన కార్యాచరణ ప్రకటించే వారన్నారు. అలాగే తన పార్టీకి పిలుపునిస్తానని, తమ శ్రేణులతో మాట్లాడుతానని పవన్ చెప్పి ఉండేవారన్నారు.
గతంలో చెప్పినట్టు లాంగ్‌మార్చ్ చేస్తానని, ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తానని పవన్ చెప్పి ఉండేవాళ్లన్నారు. అలాగే తానే మిగిలిన పార్టీలతో మాట్లాడుతానని , మీరేం చేస్తారు, తానేం చేయాలని ఇతర పార్టీలను పవన్ అడిగే వాళ్లని చెప్పుకొచ్చారు. ఇవేం చేయకుండా పవన్‌కల్యాణ్ తన దగ్గరికి వస్తేనే మాట్లాడి, స్టేట్‌మెంట్లు ఇస్తున్నారన్నారు.
ఆయన స్టేట్‌మెంట్స్ చూస్తే ఇప్పుడు మనకు కన్ఫ్యూజ్ వస్తోందన్నారు. నిజంగానే అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఆయన పార్టీ కార్యాచరణ ఏముంది? ఇప్పుడు తనకు తెలిసి రాజధానిపై పవన్ మాట్లాడి ఆరు నెలలు దాటిందన్నారు.
336 రోజులుగా రైతాంగం అంతా రోడ్డు మీదపడి ఆందోళనలు చేస్తున్నారన్నారు. పోలీసుల అణచివేత, పోలీసులతో కొట్లాటలు, అరెస్టులు, జైళ్లు, ఇలా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని శ్రావణ్‌కుమార్ తెలిపారు. పవన్ దగ్గరికి రైతులు వెళ్లడం కాదని, ఆయనే వాళ్ల దగ్గరికి పోయి మాట్లాడాల్సిందని శ్రావణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. అలా చేయకపోగా అమరావతిపై కన్ఫ్యూజ్ చేసేలా మాట్లాడ్డం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పవన్‌పై ఆయన కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో కలిసిపోయిన తర్వాత పవన్ తన ఐడెంటిటీని కోల్పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏమీ లేదని తేల్చి చెప్పారు. గతంలో పవన్‌కల్యాన్ తనకు నచ్చింది, న్యాయమని భావించింది, ఇష్టమనుకున్న అంశాలపై మాట్లాడేవారన్నారు.
ఇప్పుడు మాట్లాడాలంటే పర్మీషన్ పైన (బీజేపీ నాయకత్వం) తీసుకోవాల్సిందేనని అవహేళన చేశారు. సొంత అభిప్రాయాలు కూడా ఉన్నాయో లేదో అనే అనుమానం వస్తోందన్నారు. ఎవరైనా చెబితే అవే మాట్లాడుతున్నారా? ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మారుతా ఉంటాయా? తనకైతే అర్థం కాలేదని మాజీ ఎమ్మెల్యే పవన్ రాజకీయాలపై వెటకారం చేశారు.
పవన్‌కల్యాణ్ వందశాతం కన్ఫ్యూజన్‌లో ఉన్నారన్నారు. అమరావతి విషయంలోనూ, రాజకీయ పార్టీని కొనసాగించడంలోనూ ఆయన కన్ఫ్యూజన్‌లో ఉన్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ సంచలన ప్రకటనతో జనసైనికులు మండిపడుతున్నారు.