ఏపీ భూముల చెర…సరిహద్దుల్లో కొట్లాటేనా…?

ఏంటో మరి. ఇదివరకూ సరిహద్దులు అంటే దేశాల మధ్యనే సంఘర్షణలు ఉండేవి. విదేశాల వారి దురాక్రమణలు జరిగేవి. అదంతా ఒక ఎత్తు అయితే ఇపుడు ఏకంగా రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులలో కూడా తరచూ వివాదాలు…

ఏంటో మరి. ఇదివరకూ సరిహద్దులు అంటే దేశాల మధ్యనే సంఘర్షణలు ఉండేవి. విదేశాల వారి దురాక్రమణలు జరిగేవి. అదంతా ఒక ఎత్తు అయితే ఇపుడు ఏకంగా రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులలో కూడా తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇక ఉత్తరాంధ్రాలో చూసుకుంటే ఒడిషా రాజకీయంతో సరిహద్దు ప్రాంతాల ప్రజాలు నిత్యం కలవరపడుతున్నారు. విజయనగరం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలతో ఒడిషా సరిహద్దుల వద్ధ వివాదాలు అలాగే ఉన్నాయి.  ఇపుడు అది కాస్తా ముందుకు సాగి విశాఖ జిల్లాకూ పాకుతోంది. ఇది కొత్త రకం పంచాయతీగా చూడాలి.

ఆంధ్రా ఒడిశా బోర్డర్ వద్ద ఉన్న డుంబ్రిగూడ మండలం కోరాపుట్ పంచాయతీ లో మూడు వందల ఎకరాల భూముల మీద ఒడిషాకు చెందిన రాజకీయ నేతల కన్ను పడిందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ పేర్కొన్నారు. దానికి కారణం ఆ భూములలో వైట్ క్లేన్ సున్నం మైనింగ్ నిక్షేపాలు ఉండడమే అని ఆయన అన్నారు.

సర్వే ఆఫ్ ఇండియా పాతిన రాళ్లను కూడా తొలగించి ఏపీకి చెందిన భూముల్లో రాజకీయ పలుకుబడి కలిగిన పెద్దలు  చొరబడడమే కాకుండా కబ్జా చేస్తున్నారని, అక్కడ గిరిజనులకు ఉన్న కాఫీ తోటలను కూడా ద్వంసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ భూములు ఒడిషా రాజకీయ నేతల కబ్జాకు గురి అయితే ఏకంగా మూడు వేల మంది దాకా గిరిజనులు రోడ్డున పడతారు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మరో వైపు చూస్తే ఒడిషా, ఆంధ్రా ప్రజల మధ్య కొట్టుకునే పరిస్థితి ఉద్రిక్తత‌లు చెలరాగకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ మేరకు అందువల్ల తక్షణం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరామని అన్నారు. మొత్తానికి చూస్తే సరిహద్దు ప్రాంతాల్లో పొరుగు రాజకీయం మూలంగా గిరిజనం నానా ఇబ్బందులు పడుతున్నార‌ని పేర్కొంటున్నారు. ఇక ఈ భూములు మావే అని పొరుగు రాజకీయ నేతలు అంటున్నారు. దీనిని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.