డ్రైవ‌ర్ లేని రైలు బండి జ‌న‌సేన‌

రాజ‌కీయ పార్టీ అన్న త‌ర్వాత దానికో విధి, విధానాలు, సిద్ధాంతాలు ఉండాలి. పార్టీ సిద్ధాంతాల‌కు త‌గ్గ‌ట్టు, పార్టీ శ్రేణుల‌ను ముందుకు న‌డిపే సేనాని త‌ప్ప‌ని స‌రి. ఒక ల‌క్ష్యంతో ఆవిర్భ‌వించే పార్టీ, అందుకు త‌గ్గ‌ట్టు…

రాజ‌కీయ పార్టీ అన్న త‌ర్వాత దానికో విధి, విధానాలు, సిద్ధాంతాలు ఉండాలి. పార్టీ సిద్ధాంతాల‌కు త‌గ్గ‌ట్టు, పార్టీ శ్రేణుల‌ను ముందుకు న‌డిపే సేనాని త‌ప్ప‌ని స‌రి. ఒక ల‌క్ష్యంతో ఆవిర్భ‌వించే పార్టీ, అందుకు త‌గ్గ‌ట్టు గ‌మ్యాన్ని చేరాలంటే, పార్టీ న‌డిపే డ్రైవ‌రే (సేనాని) కీల‌కం. 2014లో ప్ర‌శ్నించేందుకు అంటూ ప్ర‌ముఖ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ నేతృత్వంలో జ‌న‌సేన అనే రాజ‌కీయ పార్టీ ఆవిర్భ‌వించింది. ఏ మూల సిద్ధాంతంతో పార్టీ ఆవిర్భ‌వించిందో, అందుకు పూర్తి భిన్నంగా 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ మిత్ర‌ప‌క్షానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ద్ద‌తు ప‌లికాడు.  అంటే అక్క‌డే ప‌వ‌న్ త‌ప్ప‌ట‌డుగు వేశాడు.

ఆ త‌ర్వాత ఎక్క‌డా స‌రిదిద్దుకునే చ‌ర్య‌లు తీసుకోలేదు. 2019లో పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ రెండు చోట్ల ఓడిపోవ‌డానికి ల‌క్ష్మినారాయ‌ణ చెప్పిన‌ట్టు ఆయ‌న నిల‌క‌డ‌లేని త‌న‌మే కార‌ణం. అలాగే పార్టీ ఘోర ప‌రాజ‌యానికి జ‌న‌సేన విధి, విధానాలే కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న టీడీపీని కాద‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీనే టార్గెట్ చేసుకుని ప‌వ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌నం తెలివైన వారు. ఎవ‌రేం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో వెంట‌నే ప‌సిగ‌డుతారు. పిల్లి పాలు తాగుతూ త‌న‌నెవ‌రూ చూడ‌లేద‌నుకుంటున్న‌ట్టుగా చంద్ర‌బాబుతో ప‌వ‌న్ లోపాయికారి ఒప్పందం గురించి తెలియ‌ద‌ని వారిద్ద‌రూ భావించారు. అయితే జ‌నం మాత్రం చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు బాగా వాత పెట్టారు.  

ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత ఒక్కొక్క‌రుగా జ‌న‌సేన‌ను వీడుతూ వ‌స్తున్నారు. జ‌న‌సేన అనే రైలు బండి నుంచి ఒక్కో బోగి త‌ప్పుకుంటూ వ‌స్తోంది. జ‌న‌సేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బ‌ల‌మైన మ‌ద్ద‌తుదారుడిగా నిలిచిన‌ దిలీప్ సుంక‌ర లాంటి వారిని కాపాడుకోలేక పోయారు. దిలీప్‌ పార్టీని ఓన్ చేసుకున్నాడే త‌ప్ప‌, అత‌న్ని పార్టీ ద‌గ్గ‌రికి తీసుకోలేక‌పోయింది. దీంతో అత‌ను నెమ్మ‌దిగా పార్టీకి దూర‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత అద్దేప‌ల్లి శ్రీ‌ధ‌ర్ కూడా పార్టీకి రాజీనామా చేశాడు. ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ కూడా జ‌న‌సేన నుంచి దూర‌మ‌య్యాడు.

వీరికంటే కూడా పార్టీ సిద్ధాంత‌క‌ర్త రాజు ర‌వితేజ పార్టీని వీడ‌టం ప‌వ‌న్‌కు షాక్ ఇచ్చింది. రాజీనామా సంద‌ర్భంగా ఘాటైన బ‌హిరంగ లేఖ రాసి మ‌రీ వెళ్లిపోయాడు. ఆ లేఖ‌లో ప‌వ‌న్ పార్టీ ప్రాథ‌మిక సిద్ధాంతానికి వ్య‌తిరేకంగా కుల‌, మ‌త‌, ప్రాంతీయ విద్వేషాల‌ను రెచ్చ‌గొడుతున్నాడ‌ని ఘాటైన విమ‌ర్శ‌లు చేశాడు. ఆ త‌ర్వాత అనేక టీవీ చాన‌ళ్ల ఇంట‌ర్వ్యూల్లో కూడా ప‌వ‌న్ వైఖ‌రిపై ఆరోప‌ణ‌లు చేశాడు.

తాజాగా సీబీఐ అధికారిగా పాపులారిటీ సంపాదించుకున్న ల‌క్ష్మినారాయ‌ణ కూడా గురువారం పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ట్టు ప్ర‌క‌టించాడు. ప‌వ‌న్‌లో నిల‌క‌డ‌లేని త‌త్వం వ‌ల్లే రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న రాజీనామా లేఖ‌లో పేర్కొన‌డం విశేషం. ఇక రేపోమాపో ఐఏఎస్ ఆఫీస‌ర్ తోట చంద్ర‌శేఖ‌ర్ కూడా ల‌క్ష్మినారాయ‌ణ బాట‌లో న‌డ‌వ‌వ‌చ్చ‌నే సంకేతాలు అందుతున్నాయి. ఇక పార్టీలో చెప్పుకోత‌గ్గ‌, గుర్తింపున్న నాయ‌కుల్లో ప‌వ‌న్‌కు మిగిలింది ఒకే ఒక్క‌డు… నాదెండ్ల మనోహ‌ర్ మాత్ర‌మే.

ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్న వారిని  గ‌మ‌నిస్తే….రైలు బండి నుంచి ఒక్కో బోగి….ఒక్కో స్టేష‌న్‌లో త‌ప్పుకున్న‌ట్టుగా ఉంది. జ‌న‌సేన రైలు గ‌మ్య‌మెక్క‌డో తెలియ‌కుండానే ప‌ట్టాల‌పై వెళుతోంది. డ్రైవ‌ర్ షూటింగ్‌ల్లో బిజీ అయ్యాడు.  ప్ర‌స్తుతానికి ఇంజ‌న్   మాత్ర‌మే దానిక‌దే న‌డుస్తోంది.  అదెప్పుడు, ఎక్క‌డ ప‌ట్టాలు త‌ప్పుతుందో తెలియ‌ని ప‌రిస్థితి.

“లక్ష్మి రాయ్ అంజలిల ఆనంద భైరవి”

కండిషన్స్ అప్లై