జనసేనలో నెలకొక వికెట్ చొప్పున రాలుతున్నాయి. నాయకులంతా తమదారి తాము చూసుకుంటున్నారు. జనసేనానే సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నప్పుడు ఇక తాము చేసేదేమీ లేదనే ఉద్దేశంతో జనసేనలో ఉన్న ఒకరిద్దరు నాయకులు కూడా పునరాలోచనలో పడ్డారని సమాచారం.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ జనసేనకు రాజీనామా చేయడం ఆ పార్టీలో పెద్ద కుదుపనే చెప్పాలి. లక్ష్మినారాయణ దారిలో తర్వాత ఎవరనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. లక్ష్మినారాయణ తర్వాత ఆ స్థాయి నాయకుడు తోట చంద్రశేఖర్. ఈయన కూడా ఐఏఎస్ అధికారి. అంతే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా. జనసేనకు ఆర్థికంగా, హార్ఠికంగా తోడ్పాటునందిస్తూ వచ్చారు.
ఈయన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున 2014లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలుగుదేశం అభ్యర్థి మాగంటి బాబు చేతిలో ఓడిపోయారు. అంతకు ముందు కూడా ఎంపీగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. పవన్ సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ అనేక సమీకరణల కారణంగా జనసేనలో చేరారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల లెక్కల తేల్చేందుకు పవన్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్స్ కమిటీ (జేఎఫ్‌సీ)లో సభ్యుడిగా కూడా ఉన్నారు. అలాగే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. జనసేన మేధోమధనం టీంలో ఆయన కూడా ఒకరు.
అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరవాత చంద్రశేఖర్ వైసీపీని వీడి జనసైనికుడిగా మారారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల లెక్కల తేల్చేందుకు పవన్ ఏర్పాటుచేసిన జాయింట్ ఫ్యాక్ట్స్ కమిటీ (జేఎఫ్‌సీ)లో సభ్యుడిగా కూడా ఉన్నారు. అనంతర కాలంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2019లో గుంటూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
ఎప్పుడైతే పార్టీలో నాదెండ్ల మనోహర్‌కు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చిందో, తోట చంద్రశేఖర్ నెమ్మదిగా దూరమవుతూ వచ్చారు. బీజేపీతో పొత్తు సందర్భంలో ఢిల్లీకి వెళ్లినప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తోట చంద్రశేఖర్‌కు కనీస సమాచారం కూడా లేదని తెలిసింది. నాదెండ్ల మనోహర్ మినహాయించి ఏ ఒక్క నాయకుడిని పవన్ తీసుకెళ్లలేదు. అలాగే విజయవాడలో బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించినప్పుడు కూడా తోట చంద్రశేఖర్‌కు స్థానం దక్కలేదు.
ఈ నేపథ్యంలో తోట చంద్రశేఖర్ అసలు జనసేనలో ఉన్నాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రాజధాని రైతుల సమస్యలపై పవన్‌కల్యాణ్ ఆందోళనలు, రైతులతో సమావేశాల్లో కానీ, తోట చంద్రశేఖర్ ఏ మాత్రం కనిపించలేదు. అందుకే జనసేన నుంచి తప్పుకునే జాబితాలో ముందు వరుసలో తోట చంద్రశేఖర్ పేరు ఉందని సమాచారం. ఈ విషయమై ఆయనే స్పష్టత ఇస్తే బాగుంటుంది.