అడిగింది చేయ‌క‌పోవ‌డం జ‌గ‌న్ నైజం

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసేందుకు మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత ఆదినారాయ‌ణ‌రెడ్డి ముందుంటారు. టీడీపీలో ఉంటే, రాజ‌కీయంగా త‌న‌కెక్క‌డ ఇబ్బందులు ఎదుర‌వుతాయోన‌నే భ‌యంతో ఆయ‌న బీజేపీలోకి జంప్ అయ్యారు. 2024 ఎన్నిక‌ల‌కు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసేందుకు మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత ఆదినారాయ‌ణ‌రెడ్డి ముందుంటారు. టీడీపీలో ఉంటే, రాజ‌కీయంగా త‌న‌కెక్క‌డ ఇబ్బందులు ఎదుర‌వుతాయోన‌నే భ‌యంతో ఆయ‌న బీజేపీలోకి జంప్ అయ్యారు. 2024 ఎన్నిక‌ల‌కు మ‌ళ్లీ ఆయ‌న ఏ పార్టీలో ఉంటారో చెప్ప‌డం క‌ష్టం. ప్ర‌స్తుతానికి బీజేపీ నాయ‌కుడిగా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు.

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మ‌ద్ద‌తుగా విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో బీజేపీ నేత‌లు దీక్ష చేప‌ట్టారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు, మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, ఎంపీలు సీఎం ర‌మేశ్‌, జీవీఎల్ న‌ర‌సింహారావు, ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌దిత‌రులు దీక్ష‌లో కూచున్న‌వారిలో ఉన్నారు. మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ జ‌గ‌న్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కే ముఖ్య‌మంత్రి అపాయింట్‌మెంట్ దొర‌క‌డం లేద‌న్నారు.

ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స‌క‌ల‌శాఖ‌ల మంత్రిగా మారార‌ని ఎద్దేవా చేశారు. అన్ని శాఖ‌ల‌పై ఆయ‌నే మీడియాతో మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. అడ‌గ‌న‌ది చేయ‌డం, అడిగింది చేయ‌క‌పోవ‌డం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నైజ‌మ‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి త‌ప్పు ప‌ట్టారు. 

సోము వీర్రాజు మాట్లాడుతూ త‌న మార్క్ కామెడీ పండించారు. ఏపీలో ఎర్ర‌చంద‌నాన్ని ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నార‌ని విమ‌ర్శించ‌డం గ‌మనార్హం. ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇవ్వ‌లేని ద‌య‌నీయ స్థితిలో రాష్ట్రం ఉంద‌న్నారు. ఉద్యోగుల‌ను రోడ్ల మీద‌కి జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకొచ్చింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.