చీర్‌గార్ల్స్ తీసుకురాం…గుడివాడ వెళ్ల‌నివ్వండి!

గుడివాడ‌కు చీర్‌గార్ల్స్ తీసుకురామ‌ని, ద‌య‌చేసి త‌మ‌ను ఆ ప‌ట్ట‌ణానికి వెళ్ల‌నివ్వాల‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. గుడివాడ వెళుతున్న ఏపీ బీజేపీ నేత‌ల్ని మార్గ‌మ‌ధ్యంలో నంద‌మూరు వ‌ద్ద పోలీసులు అడ్డుకున్నారు.…

గుడివాడ‌కు చీర్‌గార్ల్స్ తీసుకురామ‌ని, ద‌య‌చేసి త‌మ‌ను ఆ ప‌ట్ట‌ణానికి వెళ్ల‌నివ్వాల‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. గుడివాడ వెళుతున్న ఏపీ బీజేపీ నేత‌ల్ని మార్గ‌మ‌ధ్యంలో నంద‌మూరు వ‌ద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ నేత‌ల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్ప‌టికే గుడివాడ‌లో ఉద్రిక్త ప‌రిస్థితులున్నాయ‌ని, బీజేపీ నేత‌లు వెళ్లి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తే ప‌రిస్థితి అదుపు త‌ప్పుతుంద‌ని పోలీసులు వాదిస్తున్నారు.

కృష్ణా జిల్లా గుడివాడ‌లో బీజేపీ త‌ర‌పున సంక్రాంతి సంబ‌రాల ముగింపు మంగ‌ళ‌వారం చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు, రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్‌, ఎమ్మెల్సీ మాధ‌వ్‌, మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి తదిత‌ర నేత‌లు విజ‌య‌వాడ నుంచి బ‌య‌ల్దేరారు. అయితే ముగింపు ఉత్స‌వాల‌కు అనుమ‌తి లేద‌ని, క‌ల్యాణ మండ‌పాన్ని పోలీసులు తిర‌స్క‌రించ‌డం గ‌మనార్హం.

అయిన‌ప్ప‌టికీ గుడివాడ‌లో ఎలాగైనా సంక్రాంతి ముగింపు సంబ‌రాలు నిర్వ‌హిస్తామ‌ని బీజేపీ నేత‌లు ప‌ట్టు ప‌ట్టి, అక్క‌డికి క‌దిలారు. తెలుగు సంప్ర‌దాయం అంటే ఏంటో చూపుతామ‌ని సోము వీర్రాజు అన్నారు. హరిదాసులు, గంగిరెద్దులు, ధర్మం, సంస్కృతిని చాటి చెబుతామ‌ని ఆయ‌న అన్నారు.  

సగం వస్త్రాలు కట్టుకున్న చీర్‌గార్ల్స్‌ను తీసుకురామని, గడ్డం వ్యక్తుల దగ్గర అర్ధనగ్నంగా ఎగురుతున్నారని సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ధర్మం అంటే గడ్డాలు పెంచుకోవడం, చేతులకు తాళ్లు కట్టుకోవడం కాదని మంత్రి కొడాలి నానిపై వ్యంగ్యోక్తులు విసిరారు.  పొడుగ్గా ఉండే గడ్డం వ్యక్తికి ధర్మం అంటే భయమని, అందుకే గుడివాడ వస్తున్నామని సోము వీర్రాజు రెచ్చ‌గొట్టేలా మాట్లాడారు.

గుడివాడ‌లో క్యాసినో వ్య‌వ‌హారం రాజ‌కీయ మంట‌లు రేపుతున్న సంగ‌తి తెలిసిందే. గుడివాడ‌లో నాని క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వ‌ద్ద‌కు టీడీపీ నిజ‌నిర్ధార‌ణ కమిటీ రాకుండా వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. ఎలాంటి ప్ర‌జాబ‌లం లేని బీజేపీ మాత్రం… జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని భ‌య‌పెట్టి గుడివాడ‌లో సంక్రాంతి ముగింపు కార్య‌క్ర‌మాల ముసుగులో స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నించింది.

ఈ నేప‌థ్యంలో గుడివాడ వెళుతున్న బీజేపీ నేత‌ల్ని పోలీసులు అడ్డుకోవ‌డం గ‌మ‌నార్హం. గుడివాడ‌కు ఇంకా 15 కిలోమీట‌ర్ల దూరంలోనే బీజేపీ నేత‌లు వెళుతున్న వాహ‌న కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకుని, వెళ్లేందుకు అనుమ‌తి లేద‌ని తేల్చి చెప్పారు. దీంతో కాలి న‌డ‌క‌న వెళ‌తామంటూ బీజేపీ నేత‌లు ముందుకు క‌దిలారు. సుమారు 3 కిలోమీట‌ర్లు పోలీసుల‌తో వాగ్వాదం చేసుకుంటూ బీజేపీ నేత‌లు వెళ్లారు.  

పార్టీ కార్య‌క్ర‌మానికి వెళుతుంటే అడ్డుకోవ‌డం ఏంట‌ని సోము వీర్రాజు నిల‌దీశారు. తాము ఏమైనా పాకిస్తాన్‌కు వెళుతున్నామా? అని ప్ర‌శ్నించారు. గుడివాడ‌కు వెళితే పోలీసుల‌కు వ‌చ్చిన న‌ష్టం ఏంట‌ని పోలీసుల‌ను నిల‌దీశారు.  తాము వెళితే శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుంద‌ని లెట‌ర్ ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.