మన దేవుళ్లను మన దేశంలో తయారు చేయరెందుకు?

భారత దేశాన్ని ఆధ్యాత్మికతకు నిలయంగా మనం గొప్పగా చెప్పుకుంటాం. కొందరు విదేశాల వారు కూడా ఇదే మాట అంటారు. పాత తెలుగు సినిమాలో అడుగడుగునా గుడి ఉంది …అందరిలో గుడి ఉంది అని ఒక…

భారత దేశాన్ని ఆధ్యాత్మికతకు నిలయంగా మనం గొప్పగా చెప్పుకుంటాం. కొందరు విదేశాల వారు కూడా ఇదే మాట అంటారు. పాత తెలుగు సినిమాలో అడుగడుగునా గుడి ఉంది …అందరిలో గుడి ఉంది అని ఒక పాట ఉంది. అందరిలో గుడి ఉంటుందో లేదో తెలియదుగాని మన దేశంలో అడుగడుగునా గుళ్ళు మాత్రం ఉన్నాయి. వేల సంవత్సరాల కిందట అంటే రాజుల, చక్రవర్తుల కాలంలో నిర్మించిన అద్భుత ఆలయాలు ఉన్నాయి.

వాటిల్లో అబ్బురపరిచే, కనువిందు చేసే శిల్ప కళా సంపద ఉంది. ఆధునిక యంత్రాలు లేని కాలంలోనే మనం నోరెళ్ళబెట్టి చూసే ఆలయాలు నిర్మించారు. ప్రపంచానికి పాఠాలు నేర్పింది భారతీయ నిర్మాణ శాస్త్రం. చెప్పుకోవాలంటే ఇదొక ఒడవని ముచ్చట.

విచిత్రమేమిటంటే … అద్భుత శిల్ప సంపదను సృష్టించిన ఈ దేశంలో ఇప్పుడు శిల్పులు కరువై పోయారా? ఎన్నో ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్న ఈ కాలంలో అద్భుత శిల్పాలు మనదేశంలో ఎందుకు ప్రాణం పోసుకోలేకపోతున్నాయి.

మనం పొద్దున్న లేచి భక్తి శ్రద్ధలతో పూజించే మన దేవుళ్ళ విగ్రహాలు విదేశాల్లో అందులోనూ నాస్తిక దేశంలో ఎందుకు తయారవుతున్నాయి? ఆ నాస్తిక దేశం పేరు కమ్యూనిస్టు చైనా. పోనీ అదేమైనా మనకు మిత్ర దేశమా అంటే అదీ కాదు. మన దేశాన్ని కబళించాలని చూస్తున్న దేశం. సందు దొరికితే దురాక్రమణకు పాల్పడుతున్న దేశం. మన శత్రువైన పాకిస్తాన్ తో అంటకాగుతూ దాన్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న దేశం.

అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ పిడివాదనకు దిగుతున్న దేశం. మన దేశం మీదికి దండయాత్ర చేసి వేలాది ఎకరాల భూభాగాన్ని చేజిక్కించుకున్న దేశం. 

అలాంటి దేశం మన దేవుళ్ళ, మహనీయుల విగ్రహాలను తయారుచేసి ఇస్తోంది. ఇప్పుడు కరోనా వార్తలతో పోటీ పడుతూ ప్రజల నోళ్ళల్లో నానుతోంది శంషాబాదుకు సమీపంలోని ముచ్చింతల్ లో ఉన్న త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమం. వైష్ణవ గురువు రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు ముచ్చింతల్‌ ముస్తాబు అవుతోంది. 45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో దివ్యక్షేత్రం ఇక్కడ నిర్మించారు. ఇక్కడ 216 అడుగుల ఎత్తుతో రామానుజుల పంచలోహ విగ్రహం ఏర్పాటు చేశారు.

దీని బరువు 1800 కిలోలు.. చైనాలో 1600 భాగాలుగా ఈ పంచలోహ విగ్రహం తయారైంది. దీని పేరు సమతా మూర్తి. ఇతర వివరాలు అప్రస్తుతం. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన బంగారు స్వప్నం యాదాద్రి అలియాస్ యాదగిరిగుట్ట పునర్నిర్మాణం. కేసీఆర్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యాదాద్రి పునర్నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.

పునర్నిర్మాణానికి సలహాలు, సూచనలు ఇచ్చింది చిన జీయర్ స్వామే.

ఇక్కడ ప్రతిష్టించబోయే నూటా ఎనిమిది అడుగుల హనుమంతుడి విగ్రహం కూడా చైనాలోనే తయారు చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ స్వప్నం భారత మొదటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం. పూరిగా ఉక్కుతో తయారైన (పటేల్ ను ఉక్కు మనిషి అంటారు కదా ) 600 అడుగుల విగ్రహం గుజరాత్ లో ఏర్పాటుంది. దీన్ని కూడా చైనాలోనే తయారు చేశారు. 

అయితే చైనాలో తయారుచేయలేదనే వాదన ప్రభుత్వం వినిపిస్తోంది. ఏది ఏమైనా మనకు, చైనాకు శత్రుత్వం ఉన్నప్పటికీ విగ్రహాల తయారీ ఆర్దర్లు మాత్రం వాళ్ళకే వెళుతున్నాయి. మన దేశంలో శిల్పులే కరువయ్యారా?