సమస్యను ఎత్తుకోవడం, అధికార పక్షంతో చీవాట్లు తినడం, జనానికి అసలు విషయం అర్థమయ్యేలోపు మరో సమస్యకు పోవడం ఇదీ టీడీపీ పరిస్థితి. పోలవరంపై కూడా లేనిపోని రాద్ధాంతం చేసి చివరకు చేతులెత్తేసింది.
ప్రాజెక్ట్ ఎత్తు విషయంలో వైసీపీతో పాటు, బీజేపీ కూడా కర్రుకాల్చి వాతలు పెట్టే సరికి సైలెంట్ అయ్యారు చంద్రబాబు. అయితే దేవినేని ఉమా మాత్రం ఎందుకో పోలవరాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. ఇప్పుడు కాదు, తను ఓడిపోయినప్పట్నుంచి ఉమాది ఇదే తంతు.
రాష్ట్రంలో ఉన్నవీ లేనివీ చాలా సమస్యల్ని లేవనెత్తుతున్నారు టీడీపీ నేతలు. మరికొందరు వివాదాలు రాజేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలా టీడీపీ నేతలంతా సందర్భానుసారం ఏదో ఒక అంశాన్ని లేదా వివాదాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఆ తర్వాత ఫెయిలవుతున్నారు, అది వేరే సంగతి. కానీ ఉమా మాత్రం పోలవరాన్ని వదిలిపెట్టనంటున్నారు.
టీడీపీకి అధికారం చేజారిన తర్వాత ఉమా ఇంకే సమస్యనూ ప్రస్తావించలేదు, స్పందించలేదు. కేవలం పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారాన్ని మాత్రమే ఆయన తలకెత్తుకున్నారు. ఎందుకో ఆయనకు ఎప్పుడూ పోలవరమే గుర్తొస్తుంది. మాట్లాడితే పోలవరం అంటారు, పోలవరంపైనే వివాదం సృష్టించడానికి ప్రయత్నిస్తారు.
ఎందుకంటే.. రేపు పోలవరం లెక్కలు తీస్తే ప్రధాన ముద్దాయిగా ఉమానే ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కమీషన్ల డబ్బులతో ఏకంగా ఓ గెస్ట్ హౌస్ కూడా కట్టించుకున్నారని ఇటీవల సోము వీర్రాజు కూడా ఉమాపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పోలవరంలో కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టును బాబుకి ఏటీఎంగా మార్చేసింది కూడా ఉమానే.
ఈ అవకతవకలన్నీ రుజువులతో సహా బైటపడితే ఉమా జైలు పక్షి కావడం ఖాయం. అందుకే.. లేనిపోని ఆరోపణలు చేస్తూ పోలవరాన్ని రచ్చకీడుస్తున్నారు ఉమా. ప్రాజెక్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం తప్పులు చేస్తుందనే భ్రమ కలిగిస్తున్నారు. బహుశా ఇలాంటి దుష్ప్రచారం వల్లే.. సీఎం జగన్ పోలవరం ప్రారంభోత్సవంపై మరింత సీరియస్ గా దృష్టిపెట్టారని అర్థమవుతోంది.
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రభుత్వం ధైర్యంగా చెప్పడం కూడా ఇలాంటి విమర్శలను తిప్పికొట్టడంలో భాగమే. ఇక సవాళ్ల విషయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి ఉమాకి ఎన్నిసార్లు కౌంటర్ ఇచ్చారో లెక్కే లేదు. అయినా కూడా ఉమా టీడీపీ అజెండాని ఏమాత్రం భుజానికెత్తుకోవట్లేదు. తన సొంత అజెండా, సింగిల్ అజెండా.. పోలవరం మాత్రమేనంటున్నారు.