ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, వైసీపీ సోషల్ మీడియా సారథి సజ్జల భార్గవ్రెడ్డికి కోపం వచ్చింది. ఫేస్బుక్లో తన పోస్టు ఉద్దేశాన్ని ఎల్లో పత్రిక ఆంధ్రజ్యోతి వక్రీకరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సజ్జల కొడుకూ పేదనే!’ శీర్షికతో తనమార్క్ వార్తా కథనాన్ని రాసిన ఆంధ్రజ్యోతికి సుతిమెత్తగానే ఆయన గడ్డి పెట్టారు. అసలు వివాదం ఏంటో తెలుసుకుందాం.
‘జగనన్నే మా భవిష్యత్’ నినాదంతో వైసీపీ జనంలోకి వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజల ఆమోదం మేరకు స్టిక్కర్లను కూడా అతికిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ తాను తయారు చేసుకున్న ప్రశ్నల్ని చదివి వినిపిస్తూ, వాటిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్న వీడియోను భార్గవ్ తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో పాటు పేదల కోణంలో కామెంట్ కూడా పెట్టారు. అదేంటంటే…
‘జగనన్నకు ఓటు వేయడమే కాదు మరో పది మందితో వేయిస్తాం మా లాంటి పేదోళ్లు బతకాలంటే జగనన్నే మళ్ళీ రావాలి’
దీన్ని ఆంధ్రజ్యోతి తన వక్రబుద్ధికి తగ్గట్టు మార్చుకుని రాసిందనేది భార్గవ్ ఆవేదన, ఆరోపణ. ‘నాకు ఆర్థిక బలం లేదు’ అని ముఖ్యమంత్రే చెప్పేశారు. ‘మేం మాత్రం ఏం తక్కువ! మేమూ పేదలమే’ అని ఆయన పార్టీ నేతలూ బీద పలుకులు పలుకుతున్నారు. మంత్రి రోజా తరహాలోనే… ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి తనను తాను ‘పేద’గా అభివర్ణించుకున్నారు. జగన్ వస్తే పేదలకు మేలు జరుగుతుందని చెప్పడం వరకు ఓకే కానీ… ‘మాలాంటి పేదలకు’ అంటూ తననూ పేదల్లో కలిపేసుకోవడమే ఇక్కడ విచిత్రం‘ అని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది.
ఈ వార్తా కథనంపై భార్గవ్ స్పందించారు. ఆంధ్రజ్యోతిని టిష్యూ పేపర్తో పోల్చారు. ఎల్లో పత్రికకు భార్గవ్ కౌంటర్ ఏంటంటే…
‘నేను ఒక Successful Business ఫ్యామిలీలో పుట్టిపెరిగా, Succesfulగా Start-ups రన్ చేశా. మీకు News దొరక్కపోతే చెప్పండి, జగనన్న అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ వివరాలు పంపిస్తా. రోజూ ఫేక్ న్యూస్ రాసి టిష్యూ పేపర్ అన్న పేరు సార్థకం చేసుకుంటున్నారు’ అని చీవాట్లు పెట్టడం గమనార్హం. తలకిందులుగా ఆలోచించే ఎల్లో పత్రిక నుంచి అంతకంటే గొప్ప వార్తలొస్తాయని భార్గవ్ ఎలా అనుకున్నారో మరి!