జనసేనాని పవన్‌కల్యాణ్ వైఖరిపై టీడీపీ సెటైర్స్ విసురుతోంది. ఒక వైపు చంద్రబాబునే పవన్ నమ్ముకున్నారు. జనసేన నిర్మాణంపై కూడా ఆయన దృష్టి సారించలేదు. జనసేనను బలోపేతం చేసుకుంటే టీడీపీ నష్టపోతుందనే ఉద్దేశంతో పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు పవన్‌కల్యాణ్ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తుండడం టీడీపీకి నచ్చడం లేదు. ఇటు బీజేపీ, అటు టీడీపీతోనూ రెండు పార్టీలపై ప్రయాణం చేయాలనేది పవన్ ఉద్దేశం.
కానీ ఇటీవల కాలంలో పవన్ అనుసరిస్తున్న రాజకీయ పంథాపై టీడీపీలో అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు “గ్రేట్ ఆంధ్ర” ప్రతినిధితో పార్టీ అభిప్రాయాల్ని పంచుకున్నారు. “పవన్‌కు సీటు, స్వీటు (డబ్బు) లేదు. ఆయనకు సెట్టింగే దిక్కు” అని అన్నారు. ఇటీవల కాలంలో పవన్‌తో పొత్తుపై టీడీపీలో అసలు చర్చే లేదని ఆ నాయకుడు చెప్పారు.
పవన్ వ్యవహార శైలి చూస్తుంటే, ఎలాంటి శ్రమ చేయకుండా, తమ కష్టార్జితాన్ని సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోందని టీడీపీ భావన. తనకు తానే టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తున్నారని, మరోవైపు తన సామాజిక వర్గ నాయకులతో అధికారంలో షేర్ అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో జనసేన ఏ మాత్రం లేదని, అలాంటప్పుడు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని ఎలా కోరుకుంటారని సదరు నాయకుడు ప్రశ్నిస్తున్నారు. ఇదే టీడీపీలో అందరి అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.
పవన్‌కల్యాణ్ మద్దతుతో సంబంధం లేకుండానే టీడీపీ అధికారంలోకి వస్తోందని ధీమాలో తమ పార్టీ శ్రేణులున్నాయని ఆయన అన్నారు. పవన్‌తో పొత్తు పెట్టుకుని, అనసవరంగా కొత్త సమస్యను సృష్టించుకోవడం ఎందుకనే ఆలోచనలో టీడీపీ నేతలు న్నట్టు ఆ నాయకుడు చెప్పారు.
టీడీపీతో పొత్తు లేకపోతే చివరికి సినిమా షూటింగ్‌లే దిక్కు అని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రజల్లో బలమే లేని జనసేన తమతో కలిసి అధికారాన్ని పంచుకోవాలనే ఆలోచనను టీడీపీ జీర్ణించుకోలేకపోతోందన్నది వాస్తవం.