రామోజీకే కాదు…మ‌ద్ద‌తుదారుల‌కు షాక్‌!

ఎల్లో మీడియాధిప‌తి రామోజీరావుకే కాదు, ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా వ‌క‌ల్తా పుచ్చుకుని మాట్లాడేవారికి కూడా ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. మార్గ‌ద‌ర్శి అక్ర‌మాల‌పై నిగ్గు తేల్చేందుకు ఏపీ సీఐడీ విచార‌ణ‌లు, అరెస్ట్‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి…

ఎల్లో మీడియాధిప‌తి రామోజీరావుకే కాదు, ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా వ‌క‌ల్తా పుచ్చుకుని మాట్లాడేవారికి కూడా ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. మార్గ‌ద‌ర్శి అక్ర‌మాల‌పై నిగ్గు తేల్చేందుకు ఏపీ సీఐడీ విచార‌ణ‌లు, అరెస్ట్‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రామోజీరావు, ఆయ‌న కోడ‌లు శైల‌జ‌ను సీఐడీ అధికారులు విచారించారు. వారి స్టేట్‌మెంట్ల‌ను రికార్డు చేసుకున్నారు. త్వ‌ర‌లో విచార‌ణ నిమిత్తం వారిని విజ‌య‌వాడ‌కు ర‌ప్పించే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో తెలుగు స‌మాజంలో అతిపెద్ద మీడియా వ్య‌వ‌స్థకు అధిప‌తి అయిన రామోజీరావు గుడ్‌లుక్స్‌లో ప‌డేందుకు వివిధ రంగాల వ్య‌క్తులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. మార్గ‌ద‌ర్శిపై సీఐడీ విచార‌ణ‌ను సాకుగా తీసుకుని, చ‌ట్టం, అన్యాయంల‌తో సంబంధం లేకుండా గుడ్డిగా రామోజీకి అండ‌గా నిలుస్తుండ‌డంపై ఏపీ సీఐడీ సీరియ‌స్‌గా దృష్టి సారించింది. త‌న‌పై ప్ర‌జ‌ల్లో నెగెటివ్ సంకేతాలు వెళుతున్నాయ‌ని, వాటికి అడ్డుక‌ట్ట వేసేందుకు రామోజీ వేసిన ఎత్తుల్ని చిత్తు చేసేందుకు సీఐడీ రంగంలోకి దిగింది.

మార్గ‌దర్శి చిట్‌ఫండ్స్ కంపెనీ నిధుల‌ను అక్ర‌మంగా త‌ర‌లించ‌డం, అలాగే అక్ర‌మ పెట్టుబ‌డుల‌ను స‌మ‌ర్థిస్తూ మాట్లాడే వాళ్ల‌ను విచారించాల‌ని సీఐడీ నిర్ణ‌యించింది. ఏ ఆధారాల‌తో మార్గ‌ద‌ర్శి అక్ర‌మాల్ని స‌మ‌ర్థిస్తున్నారో చెప్పాల‌ని నోటీసులు జారీ చేసేందుకు సిద్ధ‌మైంది.

అంతా చ‌ట్ట‌బ‌ద్ధంగా మార్గ‌ద‌ర్శి చేస్తోంద‌ని, రామోజీని వేధించ‌డానికే సీఐడీ కేసు పెట్టింద‌ని ప్రొఫెస‌ర్ జీవీఆర్ శాస్త్రి ప్ర‌ధాని మోదీకి లేఖ రాయ‌డాన్ని ఈనాడు ప‌త్రిక ప్ర‌ముఖంగా ప్ర‌చురించింది. ఇలాంటి వారు మ‌రికొంద‌రు నిత్యం రామోజీ సొంత ప‌త్రిక‌లో త‌మ అభిప్రాయాల్ని వ్య‌క్తం చేయ‌డం చూస్తున్నాం. వీళ్లంద‌రికీ సీఐడీ నోటీసులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. 

గాలిలో మాట‌లు కాకుండా, ఆధారాలు చూపాల‌ని సీఐడీ కోర‌డం తాజా ప‌రిణామం. ఈ ప‌రిస్థితుల్లో రామోజీకి ఇక‌పై మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి ముందుకొచ్చే వాళ్లెవ‌రో చూడాలి.