కొడాలి నాని: ఎవరికి రౌడీ ఎవరికి హీరో?

కొడాలి నాని. ఈ పేరు చెబితే “అసెంబ్లీ రౌడీ” అంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లల్లో చాలామంది.  Advertisement 2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పరిచినప్పటి నుంచీ మాటల తూటాలతో కొడాలి నాని తన విశ్వరూపం…

కొడాలి నాని. ఈ పేరు చెబితే “అసెంబ్లీ రౌడీ” అంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లల్లో చాలామంది. 

2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పరిచినప్పటి నుంచీ మాటల తూటాలతో కొడాలి నాని తన విశ్వరూపం చూపిస్తూనే ఉన్నారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆ రేంజులో ఊహించని పదజాలంతో తిట్టిపోసే వ్యక్తి మరొకడు లేడు. పైగా అలా తిడుతున్నప్పుడు నానీని గమనించండి. కడుపారా, కసితీరా తిడుతున్నట్టుంటుంది తప్ప ఏదో రాజకీయం కోసం పైపైన తిడుతున్నట్టుండదు. 

కొడాలి నాని వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డికి యశోరక్షకుడు. ఎవరు జగన్ ని ఏ మాటన్నా అన్నవారితో పాటు చంద్రబాబుకి కూడా మాటలతో తద్దినం పెట్టేస్తాడు. 

అందుకే జగన్ ని ఏమనాలన్నా కొడాలి నాని మాటల దాడికి ప్రిపేరైతేనే అనాలనే ఆలోచన ప్రతిపక్షాల వారికి కలుగుతుంది. 

జగనంటే ఎందుకంత ప్రేమ అని అడిగితే స్వయంగా నాని మాటల్లో: “వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని. ఆయన మా జిల్లాకి వచ్చినప్పుడు నా గుడివాడ నియోజకవర్గం తరపున కొన్ని సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నాను. అప్పుడు దేవినేని ఉమ వెళ్ళొద్దన్నాడు. అంతే కాకుండా చంద్రబాబుతో కూడా నాకు చెప్పించాడు. అయినా నా ప్రజల కోసం వెళ్లాను. ప్రతిపక్ష ఎమ్మెల్యేనని కూడా చూడకుండా రాజశేఖరరెడ్డి గారు నన్ను ఆదరించి నేను కోరినవన్నీ సాంక్షన్ చేసారు. అంతే కాదు నన్ను, నా కూడా వచ్చిన నా మనుషులకి ఆయన టేబుల్ మీద బలవంతపెట్టి మరీ భోజనం పెట్టారు. ఆ గొప్ప గుణం ఆయనలో చూసాను. అదొక్కసారే కాదు ఎన్నిసార్లు అడిగినా నాకు ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ అపాయింట్ మెంట్ దొరికేది. ఆయన కన్నా ఎక్కువగా ఆయన కొడుకు జగన్ నన్ను ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నారు”. 

ఈ మాటల్లో మర్మం గ్రహించాలి. తన నియోజకవర్గ ప్రజల కోసం తన హై కమాండ్ నే ధిక్కరించి ముందుకెళ్లాడు. తన నియోజకవర్గ ప్రజల కోసం ప్రతిపక్ష ముఖ్యమంత్రిని పలుసార్లు కలిసి పనులు చేయించుకున్నాడు. మంచిగా మాట్లాడి ఆదరిస్తే మనసిచ్చేసాడు. 

అంటే ఏంటి? ఇవన్నీ బోళా గుణాలు. కొడాలి నానికి చంద్రబాబు మార్కు రాజకీయం తెలీదు. మెదడుతో లెక్కలేసి పని చెయ్యడు. మనసుతో పని చెయ్యడమే తెలుసు. తన డ్యూటీకి అడ్డొస్తే ఎవ్వడినీ లెక్కచెయ్యడు. సొంత కులం బేరీజులు వేసుకోడు. 

“కొడాలి నానికి రాజకీయ జీవితం అయిపోయింది. ఇలాంటి వాడిని ప్రజలు మరోసారి ఎన్నుకోరు. ప్రజలు చూస్తున్నారు. గుణపాఠం చెప్తారు”, అంటూ సోషల్ మీడియాలో కొంతమంది అంటున్నారు. 

కొందరైతే, “గుడివాడ ప్రజలకి బుద్దిలేదు. ఇలాంటి వాడిని నాలుగు సార్లు ఎలా ఎన్నుకున్నారో?” అని పలుసార్లన్నారు. 

ఆ ప్రశ్నలోనే సమాధానముంది. 

2004లో వై.ఎస్.ఆర్ వేవ్ లో తెదేపా చావుదెబ్బ తిన్నప్పుడు కోడాలి నాని మాత్రం అదే తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ నుంచి ఏకంగా 62% ఓట్ల మెజారిటీతో నెగ్గాడు. 

2009లో మళ్లే అదే పార్టీనుంచి 46% ఓట్లతో నెగ్గాడు. అప్పుడు కూడా వై.ఎస్.ఆర్ ప్రభుత్వమే ఏర్పాటయింది. 

అంటే తెదేపా రాష్ట్రంలో దారుణంగా చతికిలబడ్డా గుడివాడలో నాని మాత్రం తెదేపా ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 

2014 లో దేశంలో మోదీ వేవ్. బీజేపీతో పొత్తు వల్ల ఇక్కడ తెదేపా వేవ్. ఆ ఊపులో కొడాలి నాని వైసీపీ తరపున నిలబడ్డాడు. అయినా కూడా 56% ఓట్లతో ఎమ్మెల్యే అయిపోయాడు. 

ఇక 2019లో వైసీపీ వేవ్. ఈ సారి కూడా కొడాలిదే 54% ఓట్లతో గెలుపు. 

అంటే గుడివాడ ప్రజలకి ప్రత్యామ్నాయ నాయకుడిని గురించి ఆలోచించే అవసరం గత 18 ఏళ్లుగా రాలేదు. 

ఏ ప్రజలైనా తమ నాయకుడు తమకి అందుబాటులో ఉండి సమస్యల్ని పరిష్కరిస్తున్నంత కాలం మరొకరి గురించి ఆలోచించరు. అలాంటి నాయకుడు ఏ ప్రతిపక్ష నాయకుడ్ని ఏ బూతు తిట్టినా పట్టించుకోరు. 

ప్రపంచం మొత్తానికి రౌడీగా కనిపించినా తన నియోజకవర్గ ప్రజలకి మాత్రం హీరోగా కనిపిస్తే చాలుగా! తిరుగేముంటుంది? నాని చేస్తున్నది అదే. 

గుడివాడ ప్రజల ఓటు బ్యాంక్ తన వెనకున్నంతకాలం మిగిలిన 12 జిల్లాల ప్రజలు, ఎన్నారైలు ఏం తిట్టుకున్నా తనకు ఊడేది ఏం లేదు. 

కొడాలి నాని ధైర్యం వెనుకున్న జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే కాదు. వెనకున్న 2 లక్షలమంది గుడివాడ ఓటర్లు.

గుడివాడలో కమ్మారెక్కువ. చంద్రబాబుని తిడితే నానికి కమ్మ ఓట్లు పడవనే భ్రమలో చాలామందున్నారు. అక్కడి ప్రజలు ఓటేస్తున్నది కేవలం కొడాలి నానికి. అంతే తప్ప తేదేపాకో, వైసీపీకో, కమ్మకులానికో కాదు. వాళ్లు చాలా క్లారిటీగా ఉన్నారు. 

ఈ మర్మం తెలియకుండా పాపం చాలామంది కొడాలి నాని ఓటమి కోరుకుంటున్నారు. అది కష్టం. 

హరగోపాల్ సూరపనేని