పీఆర్సీ ఉత్తర్వులు, వాటిని నిలిపివేయాలని.. పీఆర్సీ ప్రకారం కొత్త వేతనాలు కాకుండా.. తమకు పాత వేతనాలే ఇవ్వాలని ఉద్యోగులు గొడవ చేస్తూ ఉండడం ఇదంతా మామూలైపోయింది. ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరుతూ.. ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది.
రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు.. ఉద్యోగుల జీతాలను తగ్గించడానికి అధికారం ఉందని.. ఈ విషయాన్ని ప్రశ్నించజాలరని హైకోర్టు వ్యాఖ్యానిస్తూనే.. కేసు అసలు విచారణను పక్కన పెట్టింది. అయితే ఈ సందర్భంగా జరిగిన కొద్దిపాటి వాదప్రతిదాలను గమనించినప్పుడు ఒక విషయం చాలా ఆసక్తికరం అనిపిస్తుంది. ఉద్యోగులు ఇంతటి స్వార్థపరులా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది.
ఉద్యోగానికి కుదురుకున్న తర్వాత.. యజమాని బదిలి చేస్తే వెళ్లడం అనేది- ఉద్యోగం కావాలనుకున్నప్పుడు ప్రాథమిక ధర్మాల్లో ఒకటి. కానీ.. ఏదో ఊరడింపుగా అన్నట్లుగా.. రాష్ట్రాన్ని విభజించినప్పుడు.. హైదరాబాదునుంచి అమరావతికి తరలివెళుతున్న ఉద్యోగులకు కొన్ని అదనపు ప్రయోజనాలు కల్పించారు.
హెచ్చార్యే లో కూడా వారికి కొంత అదనంగా దక్కే వెసులుబాటు వచ్చింది. తర్వాత వారికి మాత్రం అయిదురోజుల పనిదినాలని.. ఇలా రకరకాల సదుపాయాలు ఇచ్చారు. తాజాగా పీఆర్సీ ఉత్తర్వుల సమయంలోనే అలాంటి అదనపు సౌకర్యాలను ప్రభుత్వం రద్దు చేసింది.
తాజాగా హైకోర్టులో వేసిన పిటిషన్లో.. విభజన చట్టం ఉత్తర్వులను అతిక్రమించారని కూడా ఆరోపించారు. విభజన చట్టంలోని 78(1) సెక్షన్ అనేది ఉద్యోగులకు రక్షణగా ఉందిట.. దాన్ని అతిక్రమించారట. సరిగ్గా ఈ డిమాండ్ దగ్గరే.. ఉద్యోగులు ఇంత స్వార్థపరులా అనే అభిప్రాయం కలుగుతోంది.
అసలు ఏపీ పునర్విభజన చట్టం అనేదానికి ఈ దేశంలో ఏ కొంచెమైనా మర్యాద దక్కిందా? ఆ చట్టంలోనే అంశాలను కేంద్రప్రభుత్వం ఎన్నడైనా పట్టించుకుందా? విభజన చట్టం ప్రకారం రాష్ట్రాలకు దక్కవలసిన హక్కులను కట్టబెట్టడానికి వారు ఎన్నడైనా ప్రయత్నించారా? అంతా శూన్యం. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్, వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ, ఆర్థిక లోటు భర్తీ.. ఇంకా ఇతరత్రా అనేకానేక హామీలు విభజన చట్టంలో ఉన్నాయి. వాటిని కేంద్రం పట్టించుకోలేదు.
తమ జీతాలు, సెలవుల విషయం వచ్చేసరికి.. విభజన చట్టం అతిక్రమణ జరుగుతోందని గగ్గోలు పెడుతున్న ఈ ఉద్యోగులు.. ఇన్నాళ్లూ విభజన చట్టాన్ని అన్ని రకాలుగానూ తుంగలో తొక్కేస్తుండగా.. ఎందుకు మాట్లాడకుండా మిన్నకున్నారు.
రాష్ట్రం ఎలా నాశనమైపోతే మనకేంటి? మన జీతాలు.. మన పీఆర్సీ మనకు వస్తే చాలు! అనుకునే నిర్లిప్త ధోరణి వారిలో దారుణంగా ప్రబలింది. అందుకే వారు విభజన చట్టం ప్రకారం రాష్ట్రం అనేక రకాలుగా నష్టపోయిన ఏ సందర్భంలోనూ స్పందించలేదు.
సామాన్య ప్రజలు ఉద్యమాలకు దిగిన సందర్భాల్లో కూడా ఉద్యోగులు నామ్ కే వాస్తే నల్ల రిబ్బన్లు ధరించి చోద్యం చూస్తూ కూచున్నారు. ఇవాళ తమ జీతాలకు వచ్చేసరికి.. విభజన చట్టం అతిక్రమించారంటూ వారు గోల చేస్తే ప్రజలు హర్షిస్తారా? వారికి మద్దతుగా నిలుస్తారా? వారిలోని స్వార్థ బుద్ధిని ప్రజలు గుర్తించకుండా ఉంటారా?