ఉద్యోగ సంఘాల నేత‌లు తొంద‌ర‌ప‌డ్డారా?

పీఆర్సీ తో పాటు, ఇతర పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వ స్పందన పై తమ అసంతృప్తి ని తెలియ చేసేందుకు – రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వర్కింగ్ క్లాస్‌కు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు…

పీఆర్సీ తో పాటు, ఇతర పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వ స్పందన పై తమ అసంతృప్తి ని తెలియ చేసేందుకు – రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వర్కింగ్ క్లాస్‌కు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు – ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. తమకు పరిష్కారం లభించక పోతే ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మె లోకి వెళ‌తామని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ప్రధాన సంఘాలు – తొలిసారిగా ఒకే గొడుగు కిందికి వచ్చాయి. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు రెండు ముఖ్య విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన తీరు మొదటిదైతే నాలుగున్నర కోట్ల పైబడిన ( ఉద్యోగులు, వారి కుటుంబాల వారు కలిపి ఓ 75 లక్షలు తీసేస్తే) ప్రజల పట్ల ఉద్యోగుల బాధ్యత రెండవది .

మొదటి విషయానికి వస్తే; ఉద్యోగులు చెబుతున్న అంశాలలో అతిశయోక్తులు, అర్ధ సత్యాలు కనపడడం లేదు. ఆర్ధికంగా కొంత నష్టం జరుగుతుందనే ప్రచారం లో కూడా వాస్తవం లేక పోలేదు. ప్రభుత్వంలో కూడా ఆ విషయంపై కొంత సానుభూతి ఉన్నట్టుగా కనబడుతున్నది. అందుకే కావచ్చు; ఆందోళనకు తయారవుతున్న ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరపడానికి కొందరు మంత్రులతో ఒక కమిటీని  ముఖ్యమంత్రి నియమించారు. ఆ కమిటీతో చర్చలకు రావలసిందిగా, ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాల నేతలకు అధికారిక ఆహ్వానం వెళ్లింది.

దానిని తిరస్కరించడం ద్వారా – ఉద్యోగ సంఘాల నేతలు తొందర పడ్డారేమోనని అనిపిస్తున్నది. ప్రభుత్వంతో ఒకటికి పదిసార్లు చర్చించడం వల్ల, ఉద్యోగులకు పోయేదేమీ లేదు. ఉద్యోగులు సహనంతో వ్యవహరిస్తున్నారనే భావం ప్రజలకు కలుగుతుంది. ప్రభుత్వంలో కూడా కొంత పునరాలోచనకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కొత్త పీఆర్సీ అమలు వల్ల, ఉద్యోగుల నెత్తి మీద ఆకాశం ఊడిపడదు.  నాలుగు రూపాయలు తగ్గితే కొంపలేమీ మునిగిపోవు. సమాజంలోని అన్ని వర్గాల కంటే- ప్రభుత్వ ఉద్యోగులే సుఖంగా బతుకుతున్నారనే భావం సమాజంలో ఉంది. అందువల్ల, బీదార్పులు అర్చడం వల్ల ప్రజల సానుభూతిని వారు కోల్పోయే ప్రమాదం ఉంది.

ప్రజల కోణం నుంచి – వారెప్పుడూ ఆత్మరక్షణలోనే ఉండే రీతిలో వారిలో అత్యధికుల వ్యవహార శైలి ఉంటుంది. అందుకే, సమ్మె అనేది చివరి అస్త్రం కావాలి. ప్రజలు కూడా ….'పాపం ఏమి చేస్తారులే వాళ్ళు మట్టుకు….'అనే భావానికి రావాలి.

కనుకనే, ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలకు ఉన్న సమస్త అవకాశాలనూ ఉపయోగించుకోవాలి. ప్రభుత్వానికి వీలైనంత సమయం ఇవ్వాలి. మాట వరుసకు, 2022 అంతా చర్చలు, నిరసనలు, నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు సహనం పాటిస్తే- ప్రభుత్వమే వెనకడుగు వేస్తుంది. సమ్మెకు వెళ్ళడానికి- పరిస్థితి అనువుగా పలకమారుతుంది. ప్రజలలో కూడా ఆమోదం లభిస్తుంది. ఎందుకు ప్రభుత్వానికి ఒక ఏడాది సమయం ఇస్తున్నదీ- సంఘాల నాయకులు తమ,తమ సభ్యులకు చెప్పుకోగలగాలి.

ఇక, రెండవది-ప్రజలు. ప్రజల్లో అత్యధికులు ప్రభుత్వ సంక్షేమ పథకాల పై ఆధార పడి జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగులు సమ్మె కు వెళితే  తమకు సంక్షేమ పథకాలు అందకపోవడానికి ఈ సమ్మే కారణమని ప్రజలు భావించే అవకాశం ఉంది. సమ్మె కు వారందరినీ మానసికంగా సంసిద్ధం చేయాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నేతలపై ఉంది. అది చేయకుండా, సమ్మెకు దిగితే; ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వారి దూకుడు చూస్తుంటే -పోలీసులకు చేతి నిండా పని తగలక  తప్పేట్టు లేదు . మంత్రి బొత్స ఇప్పటికే ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు .

ప్రభుత్వం అనేది అత్యంత సర్వ శక్తిమంతమైన వ్యవస్థ. 'ఉఫ్…' అంటే ఎగిరి పోతుందా అనే భావం కలిగించేది ఉద్యోగుల వ్యవస్థ. తెలంగాణ లో ఆర్టీసీ ఉద్యోగులు భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ 56 రోజులు సమ్మె చేశారు. ప్రజా రవాణాను స్తంభింప చేశారు. చివరకు, మా సమ్మె కాలానికి జీతాలు ఇస్తే, సమ్మె  విరమించి విధుల్లో చేరతామంటూ కాళ్ళ బేరానికి వచ్చారు. అందుకే ప్రభుత్వ ఆర్ధిక, రాజకీయ పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకుని; ప్రభుత్వానికి మరో ఏడాది సమయం ఇవ్వాల్సిన వివేకం -ఉద్యోగ సంఘాల నేతలపై ఉంది.  

వివిధ సంఘాల మధ్య ఇప్పుడు నెలకొన్న సఖ్యతను మరో ఏడాది కొనసాగించడం -నాయకులకు కష్టం కాకపోవచ్చు. కీలెరిగి వాత పెట్టాలి తప్ప; అత్యంత శక్తివంతమైన ప్రభుత్వంతో తాము వ్యవహరిస్తున్నామనే  విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు కలలో కూడా మరిచిపోకూడదు .

-భోగాది వేంకట రాయుడు