అబద్ధాలే కాదు, నాటకాలాడినా నమ్మేట్టు ఉండాలి. అదేంటో గానీ, ఏపీ బీజేపీ ఏం చేసినా…జనం వెంటనే పసిగట్టేస్తున్నారు. అందుకే ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ఆదరణ కరువైంది. తాము చేయాల్సిన పని వదిలేసి, పొంతన లేనివి నెత్తికెత్తుకోవడం ఒక్క ఏపీ బీజేపీకే చెల్లింది. ఆ పార్టీ నాటకాలు వెంటనే బయటపడుతున్నాయి. ఏపీ బీజేపీ తీరుపై పౌర సమాజం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
ఏపీ ఉద్యోగుల మద్దతు పొందాలనే ఉబలాటంలో ఏపీ బీజేపీ కార్యాచరణకు దిగింది. ఒకవైపు పీఆర్సీ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలు నోటీసు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లకు మద్దతు తెలుపుతూ ఏపీ బీజేపీ కీలక ప్రకటన చేసింది.
ఉద్యోగులకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో మంగళవారం పలువురు పార్టీ నేతలు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టనున్నారు. దీన్ని ఎవరూ తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయంటూ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన మాటేమిటి? వారికి మద్దతుగా ఇదే విధంగా బీజేపీ దీక్ష చేపట్టగలదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా బీజేపీ మిత్రుడు జనసేనాని పవన్‌కల్యాణ్ కూడా ఒక రోజు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవేవీ పట్టని బీజేపీకి… ఏపీ ఉద్యోగుల డిమాండ్లు మాత్రం భలే నచ్చేశాయి. విశాఖ ఉద్యోగుల సమస్యలపై కూడా ఇదే రీతిలో ఒక రోజు దీక్ష కూచోవాలని సోము వీర్రాజుకు నెటిజన్లు విన్నవించుకుంటున్నారు.