కేంద్రం ఏం చేసినా…జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌రా?

అఖిల భార‌త స‌ర్వీసు ఉద్యోగుల‌పై కేంద్ర ప్ర‌భుత్వ పెత్త‌నాన్ని ప‌లు రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నాయి. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు, కేర‌ళ‌, తెలంగాణ ముఖ్య‌మంత్రులు కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌సిస్తూ ఘాటుగా లేఖ‌లు కూడా రాశాయి.…

అఖిల భార‌త స‌ర్వీసు ఉద్యోగుల‌పై కేంద్ర ప్ర‌భుత్వ పెత్త‌నాన్ని ప‌లు రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నాయి. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు, కేర‌ళ‌, తెలంగాణ ముఖ్య‌మంత్రులు కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌సిస్తూ ఘాటుగా లేఖ‌లు కూడా రాశాయి. కానీ ఈ విష‌య‌మై ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న‌కేమీ సంబంధం లేన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. త‌న రాష్ట్రంలోని అఖిల భార‌త స‌ర్వీసు ఉద్యోగుల‌పై కేంద్ర ప్ర‌భుత్వ పెత్తనాన్ని ఏపీ సీఎం స్వాగ‌తిస్తున్నార‌ని అనుకోవాలా? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

అఖిల భార‌త స‌ర్వీసుల (ఏఐఎస్‌) కేడ‌ర్ రూల్స్‌-1954కు కేంద్రం తాజాగా ప్ర‌తిపాదించిన స‌వ‌ర‌ణ‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మయ్యాయి. కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌లు రాజ్యాంగానికి, స‌మాఖ్య స్ఫూర్తికి గొడ్డ‌లి పెట్టు అని తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న మార్క్ నిర‌స‌న‌ను కేంద్రానికి తెలియ‌జేశారు. ఈ మేర‌కు ఆయ‌న ప్ర‌ధాని మోడీకి ఘాటు లేఖ రాయడం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా కేంద్ర ప్ర‌భుత్వ సవరణలు ఉన్నాయని కేసీఆర్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రాల్లో అఖిల భారత సర్వీసుల అధికారులు నిర్వర్తించే క్లిష్టమైన బాధ్యతల నేపథ్యంలోనే.. వారిని డిప్యుటేషన్‌పై పంపడానికి రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరమయ్యేలా నిబంధనలు ఉన్నాయని స్పష్టం చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి ఏక‌ప‌క్ష ధోర‌ణితో స‌వ‌ర‌ణ‌లు చేసింద‌ని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. క‌నీసం రాష్ట్ర ప్ర‌భుత్వాల అభిప్రాయాలు, అంగీకారాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి లేకుండానే అధికారులను తీసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు. సవరణలు అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత కోల్పోయి నామమాత్రపు సంస్థలుగా మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  

ఈ సవరణలను ఇలా దొడ్డిదారిన కాకుండా.. ధైర్యముంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా సవరించాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలగకుండా ఉండాలంటే.. రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నాకే రాజ్యాంగ సవరణలు చేపట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్ర‌భుత్వాల పాల‌నా వ్య‌వ‌హారాల్లో కేంద్ర ప్ర‌భుత్వం త‌ల‌దూర్చ‌డ‌మే అని కేసీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు.

రాష్ట్రాల్లో పనిచేసే ఉన్న‌తాధికారుల‌ను త‌మ చెప్పుచేతుల్లో ఉంచుకోవడానికి కేంద్ర ప్ర‌భుత్వం స‌వ‌ర‌ణ‌లు చేస్తే…ఏపీ సీఎం జ‌గ‌న్ క‌నీసం ఇదేంట‌ని ప్ర‌శ్నించే ప‌రిస్థితిలో కూడా లేక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మౌనం పాటించ‌డం ద్వారా కేంద్ర ప్ర‌భుత్వ అప్ర‌జాస్వామిక విధానాల‌కు ఆయ‌న ఒత్తాసు ప‌లుకుతున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.