త‌గ్గేదే లేదంటున్న జ‌గ‌న్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్షేమ పాల‌న త‌ప్ప అభివృద్ధికి స్థానం లేద‌నే విమ‌ర్శ‌లు ఎన్ని వ‌స్తున్నా… ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాత్రం తాను త‌గ్గేదే లేద‌ని చ‌ర్య‌ల ద్వారా చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఒక‌వైపు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్షేమ పాల‌న త‌ప్ప అభివృద్ధికి స్థానం లేద‌నే విమ‌ర్శ‌లు ఎన్ని వ‌స్తున్నా… ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాత్రం తాను త‌గ్గేదే లేద‌ని చ‌ర్య‌ల ద్వారా చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఒక‌వైపు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఏ మాత్రం బాగా లేదంటూనే, కొత్త సంక్షేమ ప‌థ‌కాల‌ను తెర‌పైకి తేవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

తాజాగా అగ్ర‌వ‌ర్ణాల్లోని పేద మ‌హిళ‌ల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంది.  ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం ఇవాళ జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఈ ప‌థ‌కం వైసీపీ ఎన్నిక‌ల ప్రణాళిక‌లో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ అగ్ర‌వ‌ర్ణాల మ‌హిళ‌ల‌ను సంతృప్తిప‌ర‌చ‌డానికి జ‌గ‌న్ ఆలోచించి కొత్త ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇందులో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న అగ్ర‌వ‌ర్ణాల మ‌హిళ‌ల‌కు ఆర్థిక ల‌బ్ధి చేకూర్చ‌నున్నారు. ఒక్కో అక్క‌చెల్లె మ్మ‌కు ఏడాదికి రూ.15 వేలు చొప్పున జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడేళ్ల పాటు రూ.45 వేలు అందించ‌నుంది. ఈ ప‌థ‌కం కింద మొత్తం 3,92,674 మంది పేద అక్కచెల్లెమ్మ‌లు ల‌బ్ధి పొంద‌నున్నారు. మంగ‌ళ‌వారం త‌న క్యాంప్ కార్యాల‌యం నుంచి నూత‌న ప‌థ‌కాన్ని ప్రారంభిస్తున్న సంద‌ర్భంగా రూ.589 కోట్లు వారి ఖాతాల్లో నేరుగా జ‌మ చేయ‌నున్నారు.

ఈ సంక్షేమ ప‌థ‌కాలు జ‌గ‌న్‌కు మ‌రోసారి అధికారం తెచ్చి పెడ‌తాయో లేదో తెలియ‌దు కానీ, ఖ‌జానా సొమ్మంతా సంక్షేమ ప‌థ‌కాల‌కే స‌రిపోతోంద‌నే భావ‌న జ‌నాల్లో ఉంది. అభివృద్ధికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేయాల‌నే డిమాండ్స్ మ‌రోవైపు నుంచి పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి. కానీ గ‌డిచిన ఈ రెండున్న‌రేళ్ల కాలంలో అభివృద్ధికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నే విమ‌ర్శ ఉంది. ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా, సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో మాత్రం తాను త‌గ్గేదే లేదంటూ జ‌గ‌న్ ముందుకే వెళుతున్నారు.