ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీలో ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో.. భారతీయ జనతా పార్టీ స్పందన ఆసక్తిదాయకంగా మారింది. తమ రెండు పార్టీలూ పొత్తులో ఉన్నట్టుగా అటు బీజేపీ, ఇటు జనసేన వాళ్లు ఇది వరకే ప్రకటించారు.
సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులతో వెళ్లిన పవన్ కల్యాణ్.. ఆ ఎన్నికలు అయిపోగానే రూటు మార్చారు. బీజేపీతో దోస్తీ చేస్తూ ఉన్నారు. ఆ అవకాశవాదాన్ని కూడా బీజేపీ భరిస్తూ పవన్ ను దగ్గరకు తీసుకున్నట్టుగానే ఉంది.
ఇక ఒక విధి, విధానం అంటూ లేకుండా సాగే పవన్ కల్యాణ్.. ఉన్నఫలంగా జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో తన పార్టీ ఉంటుందని ప్రకటించుకున్నారు. అయితే ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల మీద కమలం పార్టీ చాలా కసరత్తు చేసింది. అన్నింటికి మించి సమయం పెద్దగా లేదు! రెండు వారాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పొత్తులు, ఎత్తులు అంటే సమయం తక్కువే!
అది కూడా ఏ ఎమ్మెల్యే సీట్ల వారీగా అయితే ఒక అభిప్రాయాలకు తొందరగా రావొచ్చు. మున్సిపాలిటీ డివిజన్ల వారీగా అంటే.. ఏ పార్టీ సత్తా ఏమిటో అంత త్వరగా తేలేది కాదు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు జనసేన-బీజేపీల మధ్యన పొత్తు చర్చలు ప్రారంభం అయినా అవి కొలిక్కి వచ్చే సరికే నామినేషన్ల గడువు కూడా ముగిసిపోవచ్చు.
ఈ విషయంపై బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ.. పొత్తు విషయంలో ఇప్పటి వరకూ ఎవరి నుంచి ప్రతిపాదనలు రాలేదని స్పష్టం చేశారు. తాము ఒంటరి పోరులోనే ఉన్నట్టుగా ఆయన పరోక్షంగా చెప్పారు. ప్రచారం విషయంలో పవన్ కల్యాణ్ ను కలుపుకుపోయే ఉద్దేశంతో ఉన్నట్టుగా కూడా పరోక్షంగానే చెప్పారు. అందరినీ కలుపుకుపోయే ఉద్దేశం ఉందన్నారు.
అయితే పొత్తు, సీట్ల పంపకం వంటి చర్చలేవీ ఇప్పటి వరకూ జరగలేదు అని టీ-బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. మరి బీజేపీకి కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే పవన్ కల్యాణ్.. పోటీ గురించి ప్రకటన చేశారని క్లారిటీ వస్తున్నట్టుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు ఉన్నట్టో లేనట్టో పవన్ కల్యాణే స్ఫష్టత ఇవ్వాల్సి ఉంది.