బిజెపి: రాజస్థాన్‌లోని ధైర్యం.. తెలంగాణలో ఏదీ?

త్వరలోనే అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బిజెపి చాలా సహజంగానే అన్ని రాష్ట్రాల్లోనూ తామే విజయఢంకా మోగించబోతున్నాం అనే మాటతో రంగంలోకి దిగుతోంది. తెలంగాణలో భారాసకు ఏకైక ప్రత్యామ్నాయం బిజపి మాత్రమేనని, ప్రజలు తమ…

త్వరలోనే అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బిజెపి చాలా సహజంగానే అన్ని రాష్ట్రాల్లోనూ తామే విజయఢంకా మోగించబోతున్నాం అనే మాటతో రంగంలోకి దిగుతోంది. తెలంగాణలో భారాసకు ఏకైక ప్రత్యామ్నాయం బిజపి మాత్రమేనని, ప్రజలు తమ పార్టీకి పట్టం కడతారని, ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాబోతున్నామని రకరకాల ప్రగల్భాలను వారు చాలా రోజుల నుంచి వల్లిస్తున్నారు. అయితే వారి వ్యవహారసరళిని గమనించినప్పుడు మాత్రం.. తెలంగాణ ఎన్నికల విషయంలో ఆ పార్టీకి ధైర్యం ఉన్నట్టుగా ఒక్క దృష్టాంతం కూడా కనిపించడం లేదు.

రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తమ తొలివిడత అభ్యర్థుల జాబితాలను ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటిదాకా ఆ ఊసులేదు. అన్ని పార్టీలు టికెట్లు ప్రకటించేసి,  అన్ని పార్టీల్లో తిరస్కృతులు, అక్కడ చెల్లుబాటు కానివారు, అసంతృప్తులు ఎవరో తేలితే.. వారికి గేలం వేసి.. తమ పార్టీలోకి ఆకర్షించి. వారికి టికెట్లు ప్రకటించాలని బిజెపి ఎదురుచూస్తున్నది.

తాజా పరిస్థితులను గమనిస్తే.. తెలంగాణలో ఆపార్టీ ఓటమి భయంతోనే కునారిల్లుతున్నదని అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణ కూడా దొరుకుతుంది. రాజస్థాన్ లో బిజెపి తరఫున ఇద్దరు కేంద్రమంత్రులు ఎమ్మెల్యే బరిలోకి దిగబోతున్నట్టుగా పార్టీ ప్రకటించింది. వీరితో పాటూ, మరికొందరు ఎంపీలు కూడా ఎమ్మెల్యే బరిలో పోటీచేయబోతున్నారట. కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘవాల్ ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీచేస్తారు. ఈ వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలను పోల్చినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోటీచేయడం లేదు. ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిఉన్నప్పటికీ.. కనీసం పార్టీ టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. ఆయన బదులుగా భార్య పోటీచేస్తారనే ఊహాగానాలు సాగుతున్నాయి.

వీటిని పోల్చిచూస్తే తెలంగాణలో బిజెపి ఎంత బలహీనంగా ఉన్నదో, గెలుపు పట్ల అపనమ్మకంతో ఉన్నదో కూడా మనకు అర్థమవుతుంది. ఇద్దరు కేంద్రమంత్రులు, కొందరు ఎంపీలు ఎమ్మెల్యే బరిలోకి దిగుతున్నారంటే దాని అర్థం పూర్తిగా రాష్ట్ర రాజకీయాలకు మళ్లుతున్నారన్నమాట. ఆ రాష్ట్రంలో అధికారం దక్కుతుందనే నమ్మకం లేకపోతే.. ఇలాంటి నిర్ణయం తీసుకోరు. కానీ తెలంగాణలో అంత ధైర్యం ఎవ్వరికీ లేదు. కిషన్ రెడ్డి కాదు కదా, పార్టీ ఎంపీల్లో ఏ ఒక్కరూ ఎమ్మెల్యేగా రంగంలోకి దిగడానికి సిద్ధంగా లేరు. ఆ పార్టీ ఇక్కడ ఓటమి తథ్యమని నమ్ముతున్నదనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. 

తెలంగాణలో ఉత్తినే మాటలు చెప్పడమే తప్ప.. విజయం కోసం పోరాడే స్ఫూర్తి ఆ పార్టీలో కొరవడింది. కిషన్ రెడ్డి, ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్, వివేక్ లాంటి సీనియర్లు ఎవ్వరూ కూడా ఎమ్మెల్యే ఎన్నికలపై ఉత్సాహం చూపించడం లేదు. ఆ భయసంకేతమే వారి పతననిర్దేశం చేస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.