ఒరిజినల్ చూసిన కళ్లతో రీమేక్ చూడలేం. మరీ ముఖ్యంగా మనసుకు హత్తుకున్న ఒరిజినల్ మూవీని రీమేక్ వెర్షన్ లో చూడ్డానికి మనసు రాదు. ఏ సినిమాకైనా ఇదే వర్తిస్తుంది. కానీ జాను సినిమాను బహుశా ఈ కేటగిరీ నుంచి తీసేయాలేమో. కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ సినిమా ట్రయిలర్ చూస్తే ఒరిజినల్ మూవీ ఎంత నచ్చిందో, ఈ ట్రయిలర్ కూడా అంతలా నచ్చేస్తుంది.
రీమేక్ చేయడం ఈజీ. కానీ ఆ కంటెంట్ లో ఎమోషన్ ను రీమేక్ లోకి తీసుకురావడం చాలా కష్టం. ఈ విషయంలో జాను సక్సెస్ అయినట్టుంది. ట్రయిలర్ లో శర్వా-సమంత కెమిస్ట్రీ చూస్తుంటే అస్సలు ఒరిజినల్ (96 మూవీ) గుర్తుకురావడం లేదు. అవే సన్నివేశాలు, అదే ఫ్లేవర్. కానీ ఈ జాను కొత్తగా ఉంది. చూస్తుంటే మరోసారి మేజిక్ రిపీట్ చేసేలా ఉంది.
రామచంద్ర పాత్రలో శర్వానంద్, జానుగా సమంత ట్రయిలర్ లో అదరగొట్టారు. తమిళ్ లో ఈ పాత్రల్ని విజయ్ సేతుపతి, త్రిష పోషించారు. “96”లో వాళ్లు చూపుతిప్పుకోనీయకుండా చేశారు. దాదాపు అదే ప్రయత్నాన్ని ఇక్కడ శర్వా-సమంత చేసినట్టున్నారు. కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, శ్రావణి కనిపిస్తున్నారు.
ఒరిజినల్ వెర్షన్ ను డైరక్ట్ చేసిన ప్రేమ్ కుమార్, జానును కూడా తీశాడు. ఒరిజినల్ వెర్షన్ తో పోల్చి చూస్తే, ఈ సినిమాలో తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు కొన్ని మార్పుచేర్పులు చేసినట్టు గతంలో దిల్ రాజు ప్రకటించాడు. అలాంటి మార్పులైతే ప్రస్తుతానికి ట్రయిలర్ లో కనిపించలేదు. ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వస్తోంది జాను.