నాగశౌర్య కథ, కథనాలు సమకూర్చి, తనే హీరోగా నటించి, తన హోమ్ బ్యానర్ లో నిర్మించిన సినిమా అశ్వద్ధామ. ఈ సినిమా టీజర్, ట్రయిలర్, ఇతరత్రా ప్రమోషన్ మెటీరియల్ అంతా బయటకు వచ్చేసింది. సెన్సారు కూడా అయిపోయింది. అయితే సినిమా జోనర్ ఏమిటన్నది చూచాయిగా తెలుస్తోంది తప్ప, కథలో పాయింట్ ఏమిటన్నది బయటకు రాలేదు.
యూనిట్ కూడా చాలా తెలివిగా ఆ పాయింట్ బయటకు రాకుండా దాచారు. ట్రయిలర్, టీజర్ చూసినా, హీరో నాగశౌర్య ఇప్పటి వరకు ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసినా, అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాల నేపథ్యంలో అశ్వద్దామ సినిమా రూపొందింది అనే అభిప్రాయం ఏర్పడుతుంది. నిర్భయ, దిశ వంటి సంఘటనలు ప్రేరణ అనిపిస్తుంది.
నాగశౌర్య అయితే ముంబాయిలోని తన ఫ్రెండ్ సిస్టర్ కు జరిగిన సంఘటన ప్రేరణగా ఈ కథ రాసుకున్నానని చెబుతున్నాడు. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం, ఓ డిఫరెంట్ పాయింట్ చుట్టూ, సినిమాలో పరిశోధన సాగుతుందని తెలుస్తోంది. సినిమాలో హీరో చెల్లెల్లి విషయంలో జరిగిన ఓ సంఘటన లీడ్ గా తీసుకుని, హీరో పరిశోధన ప్రారంభిస్తే, అలాంటి వ్యవహారాలు చాలా ఇళ్లలో జరిగాయని తెలియడం, ఆ థ్రెడ్ తీసుకుని ముందుగా సాగడం వంటి కథ వుంటుందని తెలుస్తోంది.
ఈ పాయింట్ అయితే ఇప్పటి వరకు స్క్రీన్ మీదకు రాలేదని తెలుస్తోంది. సుమారు 15 కోట్లు ఖర్చుచేసి అశ్వద్దామ సినిమాను నిర్మించారు. థియేటర్, నాన్ థియేటర్ కలిపి రికవరీ అయిపోయారు. లాభాలు రావాలంటే మాత్రం సినిమాకు ఓవర్ ఫ్లోస్ రావాల్సిందే. ఈ వారం థియేటర్లలోకి వస్తోందీ సినిమా.