తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కోర్టుల్లో వరుస ఝలక్ లు తగులుతున్నాయి! చంద్రబాబు అరెస్టు అయినప్పుడే సాయంత్రానికి ఆయన బయటకు వస్తారని వీరాభిమానులు ఆశించారు. అయితే వారాలకు వారాలు గడిచిపోతున్నా ఏ కోర్టులోనూ చంద్రబాబుకు కాస్త ఊరట కూడా లభించడం లేదు.
చంద్రబాబు అరెస్టుకు సంబంధించి సాంకేతిక అంశాల ఆధారంగానే ఆయన న్యాయవాదులు ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఈ సాంకేతిక అంశాలను న్యాయస్థానాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదు.. అనే అంశాల ఆధారంగానే విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ చంద్రబాబు న్యాయవాదులు వాదిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఏ కోర్టు కూడా అంత సీరియస్ గా తీసుకోకపోవడం గమనార్హం!
అవినీతి జరగలేదని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు ఎక్కడా వాదించినట్టుగా వార్తలు కనిపించడం లేదు. తమ క్లైంట్ పై కక్ష సాధింపు అంటున్నారు, గవర్నర్ అనుమతి లేదు అంటున్నారు, ఎఫ్ఐఆర్ లో పేరు లేదంటున్నారు!
చంద్రబాబును వెంటనే విడుదల చేయాలి, క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్.. సీఐడీ కస్టడీకి వద్దు, సీఐడీ కస్టడీ ఆదేశాలను క్వాష్ చేయండి.. ఇలా రకరకాల పిటిషన్లలో కూడా పై వాదనలే ప్రముఖంగా వినిపిస్తున్నారు చంద్రబాబు న్యాయవాదులు. సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను అర్జెంటుగా విచారణకు స్వీకరించాలనే వాదన కూడా అక్కడ నిలబడినట్టుగా లేదు.
గతంలో ఏపీ హైకోర్టులో పనిచేసిన న్యాయమూర్తి ఈ పిటిషన్ విషయంలో *నాట్ బిఫోర్ మీ* తో తప్పుకున్నారు. దీంతో ఈ కేసు మరో బెంచ్ కు వెళ్లినట్టే. దీంతో అర్జెంటుగా విచారణ కుదరదని, అక్టోబర్ మూడో తేదీన ఈ కేసు విచారణకు రానుందని స్పష్టం చేసింది.
ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుపై పరిస్థితులు పగబట్టేశాయి. గతంలో లోడెత్తేవారి సహకారంలో చంద్రబాబు అనుకున్నట్టుగా అంతా జరిగిందని, ఇప్పుడు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.