“విమానంలో పిచ్చి పనులు” అనే ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఘటనలు బయటకొస్తున్నాయి. మొన్నటికిమొన్న తప్పతాగి ఓ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయబోయాడు. అంతకంటే ముందు ఓ వ్యక్తి, తాగిన మైకంలో ఓ మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన పెద్ద సంచలనమైంది. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన. సిబ్బందిపై ఓ ప్రయాణికుడు ఏకంగా చేయి చేసుకున్నాడు.
ఢిల్లీ నుంచి లండన్ కు విమానం బయల్దేరింది. ఫ్లయిట్ లో 225 మంది ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు పిచ్చిగా ప్రవర్తించడం ప్రారంభించాడు. సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఒకరిపై ఏకంగా చేయి చేసుకున్నాడు.
జరిగిన ఘటనతో సిబ్బంది షాక్ అయ్యారు. అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. లిఖితపూర్వకంగా హెచ్చరించినా వినలేదు. పైపెచ్చు మరో ఇద్దరు సిబ్బందిని గాయపరిచాడు. దీంతో ఈ విషయాన్ని ఎయిరిండియా సీరియస్ గా తీసుకుంది.
టేకాఫ్ అయిన విమానాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో మళ్లీ ల్యాండ్ చేశారు. సదరు ప్రయాణికుడ్ని కిందకు దించేసి, పోలీసులకు అప్పగించారు. అతడిపై రాతపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు.
జరిగిన ఘటనతో విమానం అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రయాణం మొదలుపెట్టింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపిన ఎయిరిండియా, ప్రయాణికుల భద్రత తమ తొలి ప్రాధాన్యమని ప్రకటించింది. “మూత్ర విసర్జన” ఘటన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో.. ఎయిరిండియా తన గైడ్ లైన్స్ పూర్తిగా మార్చేసింది. దీంతో పాటు లిక్కర్ పాలసీని కూడా సవరించింది.