మార్గదర్శి అక్రమాలపై ఏపీ సీఐడీ దూకుడు ప్రదర్శించడంపై రామోజీరావు కలవరపడుతున్నారు. తనకు మద్దతుగా గల్లీ, సిల్లీ నాయకులు అనుకూలంగా మాట్లాడుతుంటే, మహాభాగ్యమంటూ ఈనాడు పత్రికలో ప్రచురిస్తున్నారు. ప్రతి రోజూ మార్గదర్శికి, రామోజీరావు వ్యక్తిగత గొప్పల గురించి కొందరు మాట్లాడ్డం, వాటిని ప్రజల చెంతకు తీసుకెళ్లడాన్ని గమనించొచ్చు. కానీ చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్ మాత్రం రామోజీకి, మార్గదర్శికి గొప్ప సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఎందుకనో తటపటాయిస్తున్నారు.
కానీ ప్రతిరోజూ టీడీపీ నేతలు కొందరు రామోజీకి అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లో సాగుతున్న నాటకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలాంటివి రామోజీని తృప్తిపరచొచ్చేమో కానీ, చట్టపరంగా అనుకూలించే అంశాలు కావని తెలుసుకుంటే మంచిది. మార్గదర్శి చిట్‌ఫండ్ అంతా సక్రమంగా నడుస్తోందని, నిధుల సేకరణ, వాటి మళ్లింపు చట్టబద్ధంగానే సాగిందని సీఐడీ విచారణాధికారుల ఎదుట రామోజీ, శైలజాకిరణ్ చెబితే సరిపోతుంది.
మామకోడలి వివరణలతో సీఐడీ సంతృప్తి చెందితే ఇక సమస్య ఏముంటుంది? మార్గదర్శి తప్పు చేసిందనేందుకు రోజూ ఈనాడు పత్రికలో తమకు అనుకూలంగా వార్తలు ప్రచురించడమే నిదర్శనం. ఇవాళ మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, మాజీ మంత్రులైన టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి సీఎం జగన్‌లో అసహనం పెరిగిందని బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. విశ్వసనీయత ఉన్న సంస్థలపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
2 లక్షల మంది వినియోగదారులున్న పెద్దసంస్థ మార్గదర్శి అని అన్నారు. వినియోగదారుడి నుంచి ఒక్క ఫిర్యాదు కూడా లేకపోయినా సీఐడీతో మార్గదర్శిపై నిందలు మోపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పుట్టకముందే స్థాపించిన సంస్థ మార్గదర్శి అని, దానిపై బురదచల్లే కార్యక్రమాలను ఖండిస్తున్నట్టు పుల్లారావు అన్నారు. మార్గదర్శిపై సీఐడీ చెబుతున్న ఏ ఒక్కదానికి సమాధానం ఇవ్వకుండా, దాని పుట్టుపూర్వోత్తరాలు, రామోజీ గొప్పతనం, విశ్వసనీయత గురించి మాట్లాడ్డం విడ్డూరంగా వుంది.
నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి వ్యవహరించకపోతే సుప్రీంకోర్టు కేసును ఎప్పుడో కొట్టి వేసేది కదా? ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా, ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి, ప్రభుత్వం పట్టించుకోవద్దని చెప్పడం సమంజసమేనా? నమ్మితేనే జనం మోసపోతారనే సంగతి తెలియదా? ఒకవేళ మార్గదర్శిని అడ్డుపెట్టుకుని రామోజీ పిల్లలు మోసం చేస్తే, దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్నకు సమాధానం ఏంటి? ఏపీ సీఐడీ విచారిస్తున్నది మార్గదర్శి అక్రమాలపై మాత్రమే. రామోజీరావు వ్యక్తిగత గుణగణాలపై కాదని గుర్తించకుంటే…ఇలా తలాతోకా లేని మాటలు మాట్లాడరు.
రామోజీకి అనుకూలంగా మాట్లాడితే, ఆయన పత్రిక ఈనాడులో కాసింత ప్రచారానికి నోచుకుంటామనే ఆశ తప్ప, మార్గదర్శి తప్పులపై ప్రేమతో కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్గదర్శి అక్రమాల నుంచి రామోజీ, ఆయన కోడలు బయట పడాలంటే …ఇలా రాజకీయ సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. న్యాయస్థానం మార్గదర్శిపై కేసులు కొట్టి వేయాల్సి వుంటుంది.