మల్టీ స్టారర్లు, భారీ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ లో రెండు సినిమాలు అనౌన్స్ చేసారు. తెలుగులో అంతకు ముందే ఆర్ఆర్ఆర్ తో శ్రీకారం చుట్టారు రాజమౌళి.
షారూఖ్..సల్మన్..హృతిక్ లాంటి నటులు అంతా మల్టీ స్టారర్లకు సై అంటున్నారు. కానీ మన తెలుగు హీరోలు మాత్రం నో అంటున్నారు. రాజమౌళి కోసం ఎన్టీఆర్-చరణ్ కలిసి చేసారు తప్ప భవిష్యత్ మళ్లీ అలాంటి కాంబినేషన్ తెలుగులో ఊహించనక్కరలేదు. ఏ తెలుగు బడా హీరో కూడా మల్టీ స్టారర్ చేయడానికి సుముఖంగా లేరు.
బన్నీ పుష్ప 2 కావచ్చు, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల లైనప్ కావచ్చు ఇదే చెబుతున్నాయి. దాదాపు తెలుగు హీరోలు అంతా భారీ సోలో పాన్ ఇండియా సినిమాలే సెట్ చేసుకుంటున్నారు. సరే, మన హీరోలు ఎక్కువగా తెలుగు సినిమాలే పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్నారు. ప్రభాస్ అలా కాదు. తను చేస్తున్నవి భారీ బాలీవుడ్ సినిమాలే. ఆదిపురుష్, సలార్ లాంటివి తెలుగు వరకు చూసుకుంటే డబ్బింగ్ సినిమాలే.
కానీ అలాంటి ప్రభాస్ కూడా బాలీవుడ్ లో మల్టీ స్టారర్లు చేయడానికి అంగీకరించడం లేదట. అసలు వార్ 2 సినిమా చేయలేకపోవడానికి కారణం ఇదే అని విశ్వసనీయవర్గాల బోగట్టా. హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ప్రభాస్ పెద్దగా ఇష్టపడలేదని తెలుస్తోంది. ప్రభాస్ ఒప్పుకుని వుంటే ఈ సినిమాను మైత్రీ సంస్థ చేయాల్సి వుంది. ఇప్పుడు మైత్రీ మరో ప్రాజెక్ట్ ను ప్రభాస్ కు సెట్ చేయాల్సి వుంది.