టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి.. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే అతిపెద్ద విజయం.. ఆర్ఆర్ఆర్ లోని నాటు-నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. మరి ఇలాంటి చరిత్రను ఎలా సెలబ్రేట్ చేయాలి. ర్యాలీ కట్టి ఊరేగించనక్కర్లేదు. కనీసం భారీ సభ ఏర్పాటుచేసి ఘనంగా సత్కరించినా సరిపోతుంది. మరి కీరవాణి-చంద్రబోస్ కు అలాంటి ఘన సన్మానం దక్కిందా?
ఆస్కార్ అవార్డ్ అందుకున్న కీరవాణి-చంద్రబోస్ ను తెలుగు చలనచిత్ర పరిశ్రమ సత్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ సత్కార కార్యక్రమం నిన్న జరిగింది కూడా. పరిశ్రమ తరఫున సన్మానం అంటే అందరూ రావాలి కదా.
మరి మన స్టార్ హీరోలు ఎక్కడ?
ఘనంగా జరగాల్సిన సన్మానానికి కీలకమైన వ్యక్తులు, మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు డుమ్మాకొట్టారు. ఆస్కార్ అవార్డ్ అందుకున్న కీరవాణి-చంద్రబోస్ లకు సన్మానం అంటే.. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్.. ఇలా టాలీవుడ్ తారలంతా క్యూ కట్టి సన్మానం చేస్తారని, వాళ్లను ఘనంగా పొడుగుతారని, వాళ్లతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ నిన్న జరిగిన సన్మాన సభకు హాజరైన స్టార్స్ ఎవరో తెలుసా? ఒకరు హీరో రాజశేఖర్, మరో హీరో సుశాంత్, ఇంకో హీరో రానా.
వీళ్లు మాత్రమే నిన్నటి సభలో కనిపించారు. చిత్ర పరిశ్రమ నుంచి జరిగిన భారీ సన్మాన సభకు హీరోల తరఫున ప్రతినిధులు వీళ్లే. కనీసం నగరంలో ఉన్న స్టార్స్ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. మహేష్ బాబు హైదరాబాద్ లో లేడు. ప్రభాస్ ఇక్కడే ఉన్నాడు కదా. గోపీచంద్, రవితేజ, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, చిరంజీవి, వెంకటేష్.. ఇలా చాలామంది హీరోలు లోకల్ గానే ఉన్నారు కదా. వాళ్లకు ఆహ్వానాలు అందలేదా? లేక ఆహ్వానాలు అందినా వీళ్లు వెళ్లలేదా?
చిరంజీవి లాంటి స్టార్లు కొందరు వ్యక్తిగత స్థాయిలో వీళ్లను సత్కరించారు. కానీ ఇలాంటి ఓ కార్యక్రమానికి కూడా హాజరైతే బాగుండేది. కనీసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు హాజరైనా బాగుండేది.
కనిపించని దర్శకుల జాడ..
హీరోల సంగతి పక్కనపెడదాం. కనీసం దర్శకులు కూడా ఈ భారీ కార్యక్రమానికి వెళ్లలేదు. ఓ పెద్ద సినిమా ఓపెనింగ్ అయితే చాలు దర్శకులంతా క్యూ కడతారు, కొబ్బరికాయలు కొడతారు, గ్రూప్ ఫొటోలు దిగుతారు. కీరవాణి-చంద్రబోస్ ను ఘనంగా సత్కరించుకున్న ఈ కార్యక్రమంలో స్టార్ దర్శకులు ఎవ్వరూ కనిపించలేదు. త్రివిక్రమ్ ఇలా వచ్చాడు, అలా వెళ్లాడు. ఇప్పటితరం స్టార్ దర్శకులెవ్వరూ సభలో కనిపించలేదు. హీరోలతో పాటు దర్శకులకు కూడా ఆహ్వానాలు అందలేదేమో అనుకోవాలి.
ఆర్ఆర్ఆర్ హీరోల సంగతేంటి?
ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ హీరోలు కూడా హాజరుకాలేదు. రామ్ చరణ్, తన భార్యతో కలిసి మాల్దీవులు పర్యటనలో ఉన్నాడు. ఎన్టీఆర్, మొన్నటివరకు హైదరాబాద్ లోనే తన కొత్త సినిమా షూటింగ్ లో ఉన్నాడు. మరి నిన్నటి కార్యక్రమం సమయానికి ఆయన ఎక్కడ, ఏ కండిషన్ లో ఉన్నాడో తెలియదు.
ఉన్నంతలో స్టార్ ప్రొడ్యూసర్లతో ఈ ఫంక్షన్ కళకళలాడింది. అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు లాంటి బడా ప్రొడ్యూసర్లు ఈ వేడుకకు వచ్చి కీరవాణి-చంద్రబోస్ ను అభినందించారు. వీళ్లు కూడా కనిపించకపోతే టోటల్ కార్యక్రమమే వెలవెలబోయేది. అయితే చెప్పుకోదగ్గ స్టార్లు, డైరక్టర్లు, కనీసం హీరోయిన్లు హాజరుకాని ఈ కార్యక్రమాన్ని మొత్తం చలనచిత్ర పరిశ్రమ నిర్వహించిన భారీ కార్యక్రమంగా అభివర్ణించడం మాత్రం సబబు కాదు. టాలీవుడ్ ప్రాతినిధ్యం బొత్తిగా కనిపించని ఈ సన్మాన కార్యక్రమానికి పేరు మార్చితే బాగుండేది.