ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీపై తలెత్తిన వివాదంలో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా హైకోర్టు ఎంతో యాక్టీవ్ రోల్ పోషిస్తోంది. ప్రభుత్వానికి ఇవాళ సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఉద్యోగులకు జీతం చెల్లించే హక్కు ప్రభుత్వానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలకు చెందిన 12 మంది నాయకులు కోర్టు ముందు మధ్యాహ్నం 2.15 గంటలకు హాజరు కావాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం కీలక పరిణామంగా చెప్పొచ్చు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య సమస్య మరింత జఠిలం కాకూడదనే మంచి ఆశయంతో ఉద్యోగ సంఘాల నాయకులను తమ ముందు హాజరు కావాలని ఆదేశించినట్టు కోర్టు స్పష్టం చేసింది.
ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య సయోధ్య కుదుర్చేందుకు హైకోర్టు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. అందుకే ఈ విషయంలో హైకోర్టు చొరవ ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఉద్యోగులు వారధిలాంటివారు. అలాంటిది ఉద్యోగులు సమ్మెకు వెళితే వ్యవస్థ నడవడం కష్టమవుతుంది. దీని వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అంతేకాదు, ఇరువురు పంతాలు పట్టింపులకు పోతే నష్టపోయేది ప్రజలే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉభయులకు సముచిత రీతిలో మార్గనిర్దేశం చేయడం శుభపరిణామంగా భావించొచ్చు. ఇద్దరి మధ్య హైకోర్టు పెద్దన్న పాత్ర పోషించనుండడం మంచిదే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.