మిస్ ఇండియాను గుర్తుచేసిన సఖీ

“అనగనగా కీర్తిసురేష్. ఆమె ఊరిలో ప్రజలంతా ఆమెను దురదృష్టవంతురాలు అంటారు. కానీ ఆది పినిశెట్టి మాత్రం కీర్తిని నమ్ముతాడు. తీసుకెళ్లి కోచ్ జగపతిబాబుకు పరిచయం చేస్తాడు. కీర్తిసురేష్ లో ఉన్న బ్యాడ్ లక్ అనే…

“అనగనగా కీర్తిసురేష్. ఆమె ఊరిలో ప్రజలంతా ఆమెను దురదృష్టవంతురాలు అంటారు. కానీ ఆది పినిశెట్టి మాత్రం కీర్తిని నమ్ముతాడు. తీసుకెళ్లి కోచ్ జగపతిబాబుకు పరిచయం చేస్తాడు. కీర్తిసురేష్ లో ఉన్న బ్యాడ్ లక్ అనే న్యూనతాభావాన్ని జగపతిబాబు తొలిగిస్తాడు. ఆమెను షూటింగ్ లో ఛాంపియన్ గా తీర్చిదిద్దుతాడు. మధ్యలో ఓ లవ్ ట్రాక్. చివర్లో కథ సుఖాంతం.”

కొద్దిసేపటి కిందట విడుదలైన గుడ్ లక్ సఖి సినిమా ట్రయిలర్ లో మేటర్ ఇది. సినిమాలో కూడా ఇంతకంటే ఎక్కువ మేటర్ ఉండదనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతుంది. ట్రయిలర్ రివ్యూ సంగతి పక్కనపెడితే.. ఇంత క్రిస్టల్ క్లియర్ గా ట్రయిలర్ ను కట్ చేయాలని మేకర్స్ కు ఎందుకు అనిపించిందో ఎంత ఆలోచించినా తట్టదు.

అసలే చిన్న ఫ్రేమ్ చూసి కథలు గెస్ చేసే రోజులివి. ఇలాంటి టైమ్ లో ట్రయిలర్ లో టోటల్ గా సినిమా చూపించేసి థియేటర్లకు రమ్మంటే ప్రేక్షకులు వస్తారా? స్పోర్ట్స్ డ్రామా సినిమాలకు గడ్డు రోజులివి. '83' లాంటి పాన్ ఇండియా సినిమానే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకుంది. తెలుగులో ఆమధ్య వచ్చిన లక్ష్య అనే సినిమా సంగతి సరేసరి.

ఓవైపు కళ్లముందు ఇన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తుంటే.. గుడ్ లక్ సఖి ట్రయిలర్ ను ఇంట్రెస్టింగ్ గా కట్ చేయాల్సింది పోయి, ఈ ఆలోచనారాహిత్యం ఏంటో అర్థంకావడం లేదు. ఈ ట్రయిలర్ చూసిన తర్వాత థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ఎంత మందికి అనిపిస్తుంది?

కీర్తిసురేష్ విషయంలో గతంలో కూడా సేమ్ మిస్టేక్ జరిగింది. ఆమె మిస్ ఇండియా అనే సినిమా చేసింది. ఆ సినిమా ట్రయిలర్ చూసిన తర్వాత ఆడియన్స్ సినిమా చూడడం మానేశారు. ఎందుకంటే, కథ మొత్తం ట్రయిలర్ లోనే ఉంది కాబట్టి. ఇప్పుడు గుడ్ లక్ సఖి ట్రయిలర్ కూడా అలానే ఉంది. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల్లో జగపతిబాబు ఉన్నాడు.