నేను ఇలాంటివి ఎప్పుడూ చూడ‌లేదు

పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళ‌న‌పై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. ఇటు ప్ర‌భుత్వానికి, అటు ఉద్యోగుల‌కు త‌న స్టైల్‌లో మంచి సూచ‌న‌లు చేశారు. తానెప్పుడూ చూడ‌న‌వి… ఇప్పుడు చూస్తున్న‌ట్టు ఆయ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఉద్యోగుల…

పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళ‌న‌పై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. ఇటు ప్ర‌భుత్వానికి, అటు ఉద్యోగుల‌కు త‌న స్టైల్‌లో మంచి సూచ‌న‌లు చేశారు. తానెప్పుడూ చూడ‌న‌వి… ఇప్పుడు చూస్తున్న‌ట్టు ఆయ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఉద్యోగుల స‌మ్మె నోటీసు నేప‌థ్యంలో ఆయ‌న సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

కొత్త పీఆర్సీ అమలు చేయటం వల్ల రూ. 10,247 కోట్లు అదనపు భారం పడుతుందని ప్రభుత్వం చెబుతుంటే … పెంచిన జీతాలు వద్దు పాత జీతాలే చాలు అంటూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగిన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని  ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కూ జీతాలు పెంచాల‌ని స‌మ్మెలు చేయ‌డం చూశామ‌ని, కానీ పెంచిన జీతాలు వ‌ద్దంటూ స‌మ్మె నోటీసుకు సిద్ధ‌మ‌వ‌డం ఇదే ప్ర‌థ‌మ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

కరోనా బీభత్సం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక దుస్థితిని దృష్టిలో పెట్టుకొని సమ్మెను నిలుపుద‌ల చేయాల్సిందిగా ఆయ‌న అభ్య‌ర్థిం చారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టింపులకు వెళ్ల‌కుండా చర్చలు ద్వారా సమస్యకు పరిష్కారం వెతుక్కోవాల్సిందిగా కోరుతున్న‌ట్టు ఆయ‌న ఓ పెద్ద మ‌నిషిగా తెలిపారు. 

సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఉండ‌వ‌ల్లి… రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో జాతీయ స్థాయిలో త‌మ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరును ఆయ‌న తీవ్రంగా వ్య‌తిరేకించారు.  దీంతో ఆయ‌న్ని పార్టీ నుంచి బ‌య‌టికి పంపారు. అప్ప‌టి నుంచి స్వ‌తంత్ర నేత‌గా రాజ‌కీయ‌, సామాజిక అంశాల‌పై త‌న‌దైన రీతిలో స్పందిస్తుండ‌డం చూస్తున్నాం. 

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ త‌న‌కు ఇష్టుడైన నాయ‌కుడిగా ఉండ‌వ‌ల్లి చెప్ప‌డం తెలిసిందే. జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉండ‌వ‌ల్లి మాట్లాడ్తార‌నేది టీడీపీ ఆరోప‌ణ‌. ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూడా విడిచిపెట్ట‌లేదు. ప‌లు అంశాల‌పై ఏపీ ప్ర‌భుత్వానికి ఆయ‌న గ‌ట్టిగానే అక్షింత‌లు వేశారు. ఉద్యోగుల విష‌యంలో ప‌ర‌స్ప‌రం సానుకూల ధోర‌ణితో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని ఉండ‌వ‌ల్లి సూచించ‌డం విశేషం.