టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో విచారణకు రావాలనే పోలీసుల నోటీసులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాలేనని తేల్చి చెప్పారు. టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ ఆధిపత్య పోరుకు దారి తీసింది.
టెన్త్ క్వశ్చన్ పేపర్స్ లీకేజీను అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టెన్త్ ప్రశ్నపత్రాలను లీక్ చేయడం ద్వారా, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెంచడానికి బీజేపీ కుట్ర చేసిందని బీఆర్ఎస్ ఎదురు దాడి చేస్తోంది.
ఈ నేపథ్యంలో లీకేజీకి ప్రధాన సూత్రధారి బండి సంజయ్ అంటూ పోలీసులు కేసు పెట్టి, ఆయన్ను అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై వచ్చారు. మరోసారి ఇవాళ విచారణకు రావాలంటూ కమలాపూర్ పోలీసులు బండికి నోటీసులు పంపారు. విచారణకు మొబైల్ ఫోన్‌తో రావాలని పోలీసులు స్పష్టం చేయడం గమనార్హం.
నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. తాను విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఇప్పటికే తన మొబైల్ ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మొబైల్ ఫోన్ చిక్కే వరకూ తాను విచారణకు రాలేనని బండి సంజయ్ చెప్పడం విశేషం. ఈ మేరకు పోలీసుల నోటీసులకు ఆయన సమాధానం ఇచ్చారు.
విచారణకు బండి సంజయ్ సహాయ నిరాకరణపై తెలంగాణ సర్కార్ ఎలా వ్యవహరించనుందో చూడాలి. బండి సంజయ్‌ని శిక్షించడం ద్వారా పేపర్ లీకేజ్ నేరాన్ని బీజేపీ మెడకు చుట్టాలని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మరోవైపు బీజేపీ కూడా ఎదురు దాడికి సిద్ధమైంది.