“ఒకటి కాదు మూడు రాజధానుల ముద్దు” అని పాలక పక్షం…లేదు లేదు “మూడు వద్దు-ఒకటే ముద్దు” అని ప్రతిపక్ష పార్టీలు వర్గాలుగా విడిపోయి ఏపీలో నినదించడం చూస్తున్నాం. అయితే ఏకంగా ఐదు రాజధానుల ఏర్పాటు దిశగా ఓ రాష్ట్ర సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటే పెద్ద గందరగోళం సృష్టిస్తుంటే, ఇక ఐదు రాజధానుల ఏర్పాటు ఇంకెంత అయోమయం కలిగిస్తోందోనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల నూతన సర్కార్ను ఏర్పాటు చేసిన జార్ఖండ్లో ఐదు రాజధానుల ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సర్కార్ పావులు కదుపుతోంది. ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచి. జార్ఖండ్లో గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువ. మెజార్టీ జనాభా వారిదే. అభివృద్దిలో బాగా వెనుకబడిన రాష్ట్రం జార్ఖండ్.
అభివృద్ధి వికేంద్రీకరణే మంత్రం
ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రధాన కారణం అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణే అని పాలక పార్టీ చెబుతోంది. ఇదే రీతిలో జార్ఖండ్లో కూడా అభివృద్ధి పరంగా ఉత్తరాధి రాష్ట్రాలతో పోటీగా ముందు వరుసలా నిలబడాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని సోరెన్ సర్కార్ భావిస్తోంది. రాజధానుల ఏర్పాటుతో అభివృద్ధి విస్తరిస్తుందని, అందరికి ఆ ఫలాలు అందుతాయని ఆ సర్కార్ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా రాంచీతో పాటు మరో నాలుగు నగరాలను రాజధాని కేంద్రాలుగా చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఫిబ్రవరిలో కేబినెట్ తీర్మానం
ఏపీ తరహాలో ఒకటి ఎక్కువ రాష్ట్రాల ఏర్పాటుకు జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. రాంచీతో పాటు దుమ్కా, మేదినినగర్, చైబాన, గిరిధర్ ప్రాంతాల్లో రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ఐదు రాజధానుల ఏర్పాటుకు జార్ఖండ్ సర్కార్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన నిర్వహించే కేబినెట్ సమావేశం ముందుకు రానున్నాయి. ముందుగా కేబినెట్లో ఆమోదించి, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లులు ప్రవేశ పెట్టనున్నట్టు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు వెల్లడించారు.